Cyclone Arnab: అర్నబ్ తుపాను ప్రభావం.. ఏపీలో మరో 7 రోజుల పాటు భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతుండగా,మరో ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర,యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వివరాలు
తుపాను పరిస్థితుల నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షలు
ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.
తుపాను పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అధికారులు తెలిపారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
వివరాలు
నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఇదిలా ఉండగా, రాయలసీమ ప్రాంతంలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.