LOADING...
EV charging stations: ఈవీ వాడుతున్నారా? తెలుసా ఏ హైవేపై ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లుంటున్నాయంటే!
ఈవీ వాడుతున్నారా? తెలుసా ఏ హైవేపై ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లుంటున్నాయంటే!

EV charging stations: ఈవీ వాడుతున్నారా? తెలుసా ఏ హైవేపై ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లుంటున్నాయంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విప్లవం ఇప్పుడు జాతీయ రహదారులపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈవీల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో గతేడాది కాలంలో ప్రధాన జాతీయ రహదారుల వెంట ఫాస్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి. ఈ విస్తరణకు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చూపుతున్న చురుకైన పాత్రే ప్రధాన కారణంగా మారింది. డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌ప్ విత్ ఈవీస్' నుంచి లభించిన తాజా గణాంకాల ప్రకారం, 2025లో దేశంలోని కీలక జాతీయ రహదారులపై పబ్లిక్ ఈవీ ఛార్జర్ల సంఖ్య 40 నుంచి 90 శాతం వరకు పెరిగినట్లు వెల్లడైంది. ఇది భారత్‌లో ఈవీ ప్రయాణాలకు మౌలిక వసతులు వేగంగా మెరుగుపడుతున్నాయనే దానికి స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు.

Details

పరిశ్రమ నిపుణుల విశ్లేషణ

ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణపై 'ఎక్స్‌ప్ విత్ ఈవీస్' వ్యవస్థాపకుడు ప్రియాంశ్ మురార్కా స్పందిస్తూ ప్రధాన జాతీయ రహదారులపై ఇప్పుడు ఛార్జర్ల లభ్యతలో పెద్దగా ఖాళీలు కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొరత ఉండొచ్చుగానీ, మొత్తం పరిస్థితి గతంతో పోలిస్తే చాలా మెరుగైందని పేర్కొన్నారు. అయితే ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. "హైవేలపై ఉన్న కొన్ని ఛార్జర్లు సాంకేతిక కారణాల వల్ల పనిచేయకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. వీటిని నిరంతరం ఆన్‌లైన్‌లో, పనిచేసే స్థితిలో ఉంచడమే తదుపరి కీలక సవాలని వివరించారు.

Details

ముఖ్యమైన జాతీయ రహదారులపై ఛార్జింగ్ నెట్‌వర్క్ (2025 గణాంకాలు)

ఎన్‌హెచ్ 48 (దిల్లీ - చెన్నై): దేశంలోనే అత్యధికంగా 652 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ 41 శాతం వృద్ధి నమోదైంది. ఎన్‌హెచ్ 44 (శ్రీనగర్ - కన్యాకుమారి): దేశంలో అతి పొడవైన ఈ రహదారిపై ఛార్జింగ్ స్టేషన్లు 70 శాతం పెరిగి మొత్తం 574కి చేరాయి. ఎన్‌హెచ్ 66 (పన్వెల్ - కన్యాకుమారి): ఈమార్గంలో 240 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి (45 శాతం వృద్ధి). ఎన్‌హెచ్ 16 (కోల్‌కతా - చెన్నై): ఇక్కడ 92 శాతం వృద్ధితో 227 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు అయ్యాయి. ఎన్‌హెచ్ 65 (పుణె - మచిలీపట్నం): 46 శాతం వృద్ధితో మొత్తం 213 ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

Details

ప్రైవేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యం

టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి ఆటో దిగ్గజాలు ఛార్జ్ జోన్, స్టాటిక్ వంటి ఛార్జింగ్ ఆపరేటర్లతో కలిసి ఈ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. అలాగే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు విషయంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. స్టాటిక్ సీఈఓ అక్షిత్ బన్సల్ మాట్లాడుతూ.. దిల్లీ-చండీగఢ్ కారిడార్ ఛార్జింగ్ సదుపాయాలకు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోంది. దిల్లీ-జైపూర్, జైపూర్-ఉదయ్‌పూర్ మార్గాలు ఇప్పుడు 'ఈవీ టూరిజం' హైవేలుగా రూపాంతరం చెందుతున్నాయి. హైవే ఎలక్ట్రిఫికేషన్ అనేది ఇకపై అక్కడక్కడా ఛార్జర్లు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఒక క్రమబద్ధమైన కారిడార్ అభివృద్ధి ప్రక్రియగా మారిందని తెలిపారు.

Advertisement

Details

రెస్టారెంట్లు - కొత్త ఛార్జింగ్ హబ్‌లు

హైవే ప్రయాణాల్లో రెస్టారెంట్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ఛార్జ్ జోన్ సీఈఓ కార్తికేయ హరియాణి పేర్కొన్నారు. "సాధారణంగా మూడు లేదా నాలుగు గంటల డ్రైవింగ్ తర్వాత ప్రయాణికులు విరామం కోరుకుంటారు. ఆ సమయంలో హైవే రెస్టారెంట్లలో ఛార్జింగ్ సదుపాయం ఉంటే, భోజనం చేసేలోపే వాహనం ఛార్జ్ అయిపోతుందని వివరించారు. ఈ తరహా సదుపాయాలు ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పశ్చిమ, ఉత్తర భారతం నిలుస్తున్నాయి.

Details

భవిష్యత్తు లక్ష్యాలు

గతేడాది భారత్‌లో ఈవీ విక్రయాలు 20 లక్షల మార్కును దాటాయి. ఇది మొత్తం వాహన విక్రయాల్లో సుమారు 8 శాతానికి సమానం. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ 2030 నాటికి లక్ష ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మహీంద్రా 2027 నాటికి వెయ్యి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ ఉత్పత్తుల విడుదల, మౌలిక సదుపాయాల కల్పన రెండూ సమాంతరంగా సాగినప్పుడే ఈవీ రంగం నిలకడగా అభివృద్ధి చెందుతుందన్నారు. మారుతీ సుజుకీ కూడా తమ ఈ-విటారా లాంచ్‌కు ముందే వినియోగదారుల్లో విశ్వాసం పెంచేలా, అన్ని రకాల ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించనుంది.

Advertisement