NHAI Emergency Services: వాహనదారుల కోసం ఎన్‌హెచ్‌ఏఐ కీలక ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఇకపై మరింత వేగంగా సాయం అందనుంది. కొత్తగా నిర్మించే ఏ జాతీయ రహదారినైనా ప్రజల రాకపోకలకు అందుబాటులోకి తీసుకొచ్చే ముందు అంబులెన్స్‌లు, రూట్ పెట్రోలింగ్ వాహనాలు, టో-అవే క్రేన్లు వంటి అత్యవసర సేవలను సిద్ధం చేయాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అంటే హైవే నిర్మాణం పూర్తయితే సరిపోదు.. దానిపై ఏదైనా ప్రమాదం జరిగినా, వాహనం మధ్యలో ఆగిపోయినా వెంటనే స్పందించే వ్యవస్థ కూడా సిద్ధంగా ఉండాలి.
Details
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే వ్యవస్థ
హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరగడం లేదా వాహనం అకస్మాత్తుగా మొరాయించడం వంటివి వాహనదారులకు పెద్ద సమస్యగా మారుతుంటాయి.
ఇలాంటి సందర్భాల్లో సహాయం కోసం ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితిని తగ్గించడమే NHAI కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం.
కొత్త రహదారి ప్రారంభించే సమయానికి అంబులెన్స్‌లు, పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు అందుబాటులో ఉండాలి.
ఈ సేవలను NHAIకి చెందిన 1033 జాతీయ రహదారి హెల్ప్‌లైన్‌తో అనుసంధానిస్తారు.
అవసరమైనప్పుడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సమీప ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని సహాయం అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
Details
హైవే నిర్వహణలోనూ ప్రత్యేక ఏర్పాట్లు
NHAI నేరుగా నిర్వహించే జాతీయ రహదారులపై అంబులెన్స్‌లను కేంద్రీకృత ఏజెన్సీ ద్వారా ఏర్పాటు చేయనున్నారు.
పెట్రోలింగ్ వాహనాలు, టో-అవే క్రేన్లను ప్రత్యేక టెండర్ల ద్వారా లేదా ఇప్పటికే ఉన్న నిర్వహణ ఒప్పందాల్లో భాగంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
కొన్ని హైవేల నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను ఇతర సంస్థలకు అప్పగించినా అంబులెన్స్ సేవలను NHAI తన సొంత ఏజెన్సీ ద్వారా కొనసాగిస్తుంది.
అయితే పెట్రోలింగ్, క్రేన్ల నిర్వహణను సంబంధిత హైవే అథారిటీలు పర్యవేక్షిస్తాయి. దీంతో బాధ్యతలు వేర్వేరుగా ఉన్నా అత్యవసర సేవల్లో ఆలస్యం జరగకుండా చూడనున్నారు.
Details
మొదటి రోజు నుంచే వాహనదారులకు సేవలు
కొత్త హైవే ప్రారంభించిన తర్వాత ఎక్కడైనా ప్రమాదం జరిగితేనే సేవలను ఏర్పాటు చేయడం కాకుండా, రహదారి ప్రారంభించే రోజునే మొత్తం అత్యవసర వ్యవస్థ సిద్ధంగా ఉండాలన్నది NHAI లక్ష్యం.
ఒక అంబులెన్స్ చేరుకోవడానికి పట్టే సమయం, మొరాయించిన వాహనాన్ని క్రేన్‌తో తొలగించడం, ప్రమాద ప్రాంతాన్ని సురక్షితంగా మార్చడం వంటి అంశాల్లో వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా రద్దీగా ఉండే జాతీయ రహదారులపై ఇలాంటి వ్యవస్థలు ప్రయాణికుల భద్రతను పెంచడంతో పాటు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ ఎక్కువసేపు నిలిచిపోకుండా చేయడంలోనూ ఉపయోగపడతాయి.