Loading...
Congress and Samajwadi Party: 'మేం బిచ్చగాళ్లం కాదు'.. యూపీలో కాంగ్రెస్‌, ఎస్పీ మధ్య సీట్ల చిచ్చు
'మేం బిచ్చగాళ్లం కాదు'.. యూపీలో కాంగ్రెస్‌, ఎస్పీ మధ్య సీట్ల చిచ్చు

Congress and Samajwadi Party: 'మేం బిచ్చగాళ్లం కాదు'.. యూపీలో కాంగ్రెస్‌, ఎస్పీ మధ్య సీట్ల చిచ్చు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వివాదం ముదురుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు ఇంకా కొనసాగుతుండగానే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా ప్రకటించడం రాజకీయ దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము 100కు పైగా అసెంబ్లీ స్థానాలు కోరుతుంటే.. ఎస్పీ మాత్రం కేవలం 26 సీట్లే ఇస్తామని చెప్పడంపై హస్తం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు ఒక కొలిక్కి రాకముందే అఖిలేశ్ యాదవ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాలుగు స్థానాలతో పాటు మరో నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించారు.

వివరాలు 

ఐదు స్థానాల్లో నాలుగు పశ్చిమ యూపీలో..

బెహట్ నుంచి ఉమర్ అలీ, సహారన్‌పుర్ నుంచి ఆషూ మాలిక్, కైరానా నుంచి నాహిద్ హసన్, అమ్రోహా నుంచి మెహబూబ్ అలీ పేర్లను ఖరారు చేశారు.

వీరంతా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక ఝాన్సీ జిల్లాలోని లలిత్‌పుర్ నుంచి జ్యోతి లోధికి అవకాశం కల్పించారు.

ఈ ఐదు స్థానాల్లో నాలుగు పశ్చిమ యూపీలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ముఖ్యంగా సహారన్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం గమనార్హం.

ఈ నాలుగు నియోజకవర్గాల్లో ముస్లిం, దళిత ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో.. కనీసం రెండు స్థానాలైనా తమకు కేటాయిస్తారని కాంగ్రెస్ నేతలు ఆశించారు.

వివరాలు 

ఎస్పీ ఏకపక్ష నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేత

అయితే, ఎస్పీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్పీ ఏకపక్ష నిర్ణయంపై కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా స్పందించారు.

''మేం బిచ్చగాళ్లం కాదు. అఖిలేశ్ యాదవ్ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడటం లేదు'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పొత్తు చర్చలు ఇంకా పూర్తికాకముందే అభ్యర్థుల పేర్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

ఎస్పీ ప్రకటించిన స్థానాల్లో కాంగ్రెస్ కూడా పోటీ చేయగలదని స్పష్టం చేశారు.

ముఖ్యంగా సహారన్‌పుర్‌లో ఎస్పీకి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలను పరిశీలిస్తోంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని యూపీ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు 

సీట్ల పంపకాలపై వీడని ప్రతిష్ఠంభన.. ఎస్పీ తీరుపై భాజపా విమర్శలు

మరోవైపు సీట్ల పంపకాల విషయంలోనూ రెండు పార్టీల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. తొలుత కాంగ్రెస్ 181 అసెంబ్లీ స్థానాలు కావాలని డిమాండ్ చేసింది.

అనంతరం పొత్తు చర్చల్లో భాగంగా ఆ సంఖ్యను 110కి తగ్గించుకుంది. అయినప్పటికీ ఎస్పీ మాత్రం 26 స్థానాలకు మించి కేటాయించేందుకు సిద్ధంగా లేదని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

సీట్ల పంపకాలపై వీడని ప్రతిష్ఠంభన.. ఎస్పీ తీరుపై భాజపా విమర్శలు

దీంతో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది.

ఈ వివాదంపై భాజపా ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్ కూడా స్పందించారు.

ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల తీరును తప్పుబట్టారు. రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని లేఖలు రాస్తూనే.. కాంగ్రెస్‌తో సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎస్పీ ఆ పార్టీని నవ్వులపాలు చేసిందని విమర్శించారు.

ఈ పరిణామాలతో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు కొనసాగుతుందా? సీట్ల పంపకాల వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT