Prithvi Shaw: యోగరాజ్ సింగ్‌కు పృథ్వీ షా గట్టి వార్నింగ్.. పరువు నష్టం చేస్తే చట్టపరమైన చర్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. తన వ్యక్తిగత జీవితం, జీవనశైలిపై యోగరాజ్ చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా స్పందించాడు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, తప్పుడు ప్రచారం చేసేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.
వివరాలు
పృథ్వీ షా కెరీర్‌పై యోగరాజ్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్.. పృథ్వీ షా కెరీర్ పతనానికి గల కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
షా జీవనశైలిని మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీతో పోల్చాడు. పార్టీలు, అమ్మాయిలతో తిరగడం, సిగరెట్లు, మద్యం సేవించడం వల్లే పృథ్వీ షా కెరీర్ నాశనమైంది.
గతంలో వినోద్ కాంబ్లీ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రతిభ ఉన్నప్పటికీ చెడు అలవాట్ల కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు.
షా విషయంలోనూ అదే పునరావృతమైంది" అని యోగరాజ్ ఆరోపించాడు.
వివరాలు
నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: షా
యోగరాజ్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే పృథ్వీ షా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. తన గతం గురించి దాచుకోవడానికి ఏమీ లేదని, దాని గురించి తాను సిగ్గుపడటం లేదని స్పష్టం చేశాడు.
అయితే తన పేరును, గతాన్ని ఉపయోగించుకుని నెగెటివిటీ వ్యాప్తి చేయడం, అనవసర వివాదాలు సృష్టించడం, ప్రచారం పొందేందుకు ప్రయత్నించడాన్ని సహించబోనని హెచ్చరించాడు.
'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం.. షా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మరింత తీవ్రంగా స్పందించాడు.
అభిప్రాయం చెప్పడానికి, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో పరువుకు నష్టం కలిగించడానికి చాలా తేడా ఉంది. దీన్ని నా చివరి హెచ్చరికగా భావించండి. నా మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు.
వివరాలు
మరింత ముదిరిన వివాదం
నా ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా తగిన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నాడు.
యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా స్పందించడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని షా హెచ్చరించడంతో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందనే ఆసక్తి క్రీడా వర్గాల్లో నెలకొంది.