Madurai: కార్తీక దీపం వివాదం.. మదురై జిల్లా అంతటా నిషేధాజ్ఞలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులోని మదురై జిల్లాలో కార్తీక దీపోత్సవం సందర్భంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశంపై వివాదం ముదిరే అవకాశం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు నవంబర్ 23వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
వివరాలు
జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు
తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని ఒక వర్గం పట్టుబడుతుండగా.. అందుకు వ్యతిరేకంగా మరో వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పెద్ద ఎత్తున జనసమీకరణకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మదురై నగర పోలీసు కమిషనర్, జిల్లా ఎస్పీ, తిరుమంగళం రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ మేరకు నివేదికలు సమర్పించారు.
ఇతర జిల్లాల నుంచి కూడా ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశముందని అంచనా వేశారు.
దీంతో ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
వివరాలు
ఏయే కార్యకలాపాలపై నిషేధం?
నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న సమయంలో మదురై జిల్లాలో ఎలాంటి సభలు, ఆందోళనలు, నిరసనలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు.
అలాగే తిరుప్పరంకుండ్రం కొండపైకి ఎవరూ వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు.
అయితే అధికారుల అనుమతితో నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు కూడా అనుమతి ఇచ్చారు.
అరుళ్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయ సిబ్బంది నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు, సంప్రదాయ పండుగ ఆచారాలకు సైతం మినహాయింపు కల్పించారు.
వివరాలు
సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ రివ్యూ పిటిషన్
మరోవైపు తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు ఈ నెల 20న సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
ఇప్పటివరకు ఈ పిటిషన్ విచారణకు రాలేదు. కార్తీక దీపోత్సవం మంగళవారం జరగనున్న నేపథ్యంలో అత్యవసర విచారణకు ప్రత్యేక అనుమతి పొందితే తప్ప పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో తిరుప్పరంకుండ్రం కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.