Loading...
Shubman Gill: కివీస్‌ బ్యాటర్లు అడ్డుపడ్డారు.. డ్రాకు కారణం చెప్పిన టీమ్‌ఇండియా కెప్టెన్
కివీస్‌ బ్యాటర్లు అడ్డుపడ్డారు.. డ్రాకు కారణం చెప్పిన టీమ్‌ఇండియా కెప్టెన్

Shubman Gill: కివీస్‌ బ్యాటర్లు అడ్డుపడ్డారు.. డ్రాకు కారణం చెప్పిన టీమ్‌ఇండియా కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు కివీస్‌ బ్యాటర్లు పట్టుదలగా ఆడటంతో భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేయలేకపోయారు. డారిల్ మిచెల్‌(49: 186 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్‌(26: 126 బంతుల్లో)అడ్డుగోడలా నిలిచారు. ఈ ఇద్దరూ 43 ఓవర్ల పాటు క్రీజులో ఉండి ఆరో వికెట్‌కు 63 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి రోజు ఫలితం తేలే అవకాశం కనిపించకపోవడంతో మరో 16ఓవర్లు మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 368 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 720/9స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 120 ఓవర్లలో 239/5పరుగులు చేసింది.

వివరాలు

జట్టు ప్రదర్శనపై గిల్‌ సంతృప్తి

తొలి టెస్టులో భారత జట్టు ప్రదర్శనపై కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. చివరి రోజు భారత బౌలర్లు వికెట్లు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ.. కివీస్‌ బ్యాటర్లు గట్టిగా ప్రతిఘటించారని తెలిపాడు.

ఈ పిచ్‌పై పది వికెట్లు తీయడం అంత సులభం కాదని ముందే ఊహించామని చెప్పాడు. కొన్ని అవకాశాలు లభించినప్పటికీ టెయిలెండర్ల విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నాడు.

మొత్తంగా ఫీల్డింగ్‌లో తమ ప్రదర్శన బాగానే ఉందని అభిప్రాయపడ్డాడు. తదుపరి టెస్టుకు ముందు బౌలర్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే డ్రాకు అంగీకరించినట్లు గిల్‌ స్పష్టం చేశాడు.

వివరాలు

పది వికెట్లు తీయడం సవాలే..

దీన్ని కఠినమైన రోజుగా భావించడం లేదు. ఈ పిచ్‌పై పది వికెట్లు తీయడం సవాలుతో కూడుకున్న పని అని మాకు ముందే తెలుసు. అయినప్పటికీ కొన్ని అవకాశాలు లభించాయి.

ముఖ్యంగా టెయిలెండర్ల విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అక్కడక్కడా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ.. మొత్తంగా మైదానంలో మా ప్రదర్శన బాగానే ఉంది.

మాకు అదే చాలా ముఖ్యం. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసినప్పుడు కూడా బాగానే రాణించాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లో జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించారు.

కేవలం ఇద్దరు మాత్రమే సెంచరీలు చేసినప్పటికీ.. మేం 700 పరుగులు సాధించాం. ఇది చాలా గొప్ప విషయమని గిల్‌ చెప్పాడు.

ADVERTISEMENT

వివరాలు

బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలనే డ్రాకు అంగీకారం

క్రైస్ట్‌చర్చ్‌లో తదుపరి టెస్టుకు ముందు మూడున్నర రోజుల సమయం ఉంది. ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు.

క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌పై బౌలర్లకు మరికొంత సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఇక్కడ ఆడిన తరహాలోనే అక్కడ కూడా ఆడి.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మా ప్రణాళికలను అమలు చేయగలిగితే విజయం సాధిస్తామని భావిస్తున్నాను.

ఈ పిచ్‌పై బౌలర్లకు మరికొంత సహకారం లభించి ఉంటే బహుశా మ్యాచ్‌ను కొనసాగించే అవకాశం ఉండేది. కానీ మా ఫాస్ట్‌ బౌలర్లు బాగా అలసిపోయారు.

ఈ మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ దాదాపు 50 ఓవర్లు బౌలింగ్‌ చేశారు. అంతేకాకుండా మరుసటి రోజు ప్రయాణం కూడా ఉంది.

ADVERTISEMENT

వివరాలు

బౌలర్లను తాజాగా ఉంచుతాం

కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తదుపరి మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అందుకే మా బౌలర్లందరినీ తాజాగా ఉంచాలని అనుకున్నాం.

మరో ఐదు నుంచి పది ఓవర్లు బౌలింగ్‌ చేసినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదు.

అందుకే మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు అంగీకరించామని గిల్‌ స్పష్టం చేశాడు.

ADVERTISEMENT