Loading...
Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్‌లో ఏపీ నిర్మాణాలు.. తెలంగాణ అధికారులపై చర్యలకు సిద్ధమైన రేవంత్ సర్కార్!
నాగార్జునసాగర్‌లో ఏపీ నిర్మాణాలు.. తెలంగాణ అధికారులపై చర్యలకు సిద్ధమైన రేవంత్ సర్కార్!

Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్‌లో ఏపీ నిర్మాణాలు.. తెలంగాణ అధికారులపై చర్యలకు సిద్ధమైన రేవంత్ సర్కార్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదానికి కేంద్రంగా మారింది. ఈ ప్రాజెక్టు ఉమ్మడిది కావడంతో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా రెండు రాష్ట్రాల అంగీకారంతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)అనుమతి కూడా అవసరం. అయితే ఇవేవీ లేకుండానే నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ సొరంగం తవ్వుతోందని బీఆర్ఎస్ ఆరోపించడంతో తెలంగాణలో రాజకీయ దుమారం మొదలైంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షం విమర్శలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఏపీ నిర్మాణాల గురించి ఇరిగేషన్ మంత్రి, ఉన్నతాధికారులకు ముందే ఎందుకు సమాచారం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. ప్రతిపక్షం బయటపెట్టే వరకు ఈ విషయం గుర్తించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వివరాలు

బీఆర్ఎస్ ఆరోపణలతో మొదలైన రాజకీయ దుమారం

అధికారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పటికీ.. ఈ వివాదం నుంచి ఎలా బయటపడాలనే అంశంపై కూడా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

నాగార్జునసాగర్ కుడివైపున ఏపీ నిర్మాణాలు చేపడుతోందని, జలదోపిడీకి సిద్ధమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా ఉందంటూ విమర్శలు గుప్పిస్తోంది. అసలు ఏపీ అక్కడ ఏ ప్రాజెక్టు నిర్మిస్తోంది? ఎప్పుడు పనులు ప్రారంభించింది? ఇంత జరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.

వివరాలు

ఫొటోలు విడుదల చేసిన కేటీఆర్.. హరీశ్‌రావు విమర్శలు

ఇప్పుడు మరోసారి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్రంగా ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ చర్చ మొదలైంది.

సాగర్ కుడివైపున ఏపీ ప్రభుత్వం పెద్ద సొరంగం నిర్మించి నీటిని తరలించేందుకు సిద్ధమైందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

ఏపీ ప్రభుత్వం ఏడాది కాలంగా సాగర్ కుడివైపున నిర్మాణాలు చేపడుతున్నా తెలంగాణ సర్కార్ స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

ఈ మేరకు నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసి, పనులు ఎంతవరకు పూర్తయ్యాయో వెల్లడించారు.

ఆ తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట సభ వేదికగా స్పందించారు

ADVERTISEMENT

వివరాలు

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై ప్రభుత్వంలో కలకలం

. తాను తెలంగాణ బిడ్డనని, ఈ గడ్డకు నీటి విషయంలో అన్యాయం చేయబోనని చెప్పే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ ఏపీ నిర్మాణాలకు రేవంత్ ప్రభుత్వం అసమర్థతే కారణమంటూ బీఆర్ఎస్ తన విమర్శలను కొనసాగిస్తోంది.

మరోవైపు ఏపీ చేపడుతున్న నిర్మాణాలపై అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే KRMBకి లేఖ రాసింది.

నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది.

ఏపీ చేపడుతున్న నిర్మాణాల వివరాలు ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖకు తెలియకపోవడంపై అధికారులు దృష్టి సారించారు.

ADVERTISEMENT

వివరాలు

ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు

ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ సర్కిల్ ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

ఇప్పటికే సర్కిల్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈ), అసిస్టెంట్ ఇంజినీర్ల (ఏఈ)పైనా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

ఏడాదికి 1.86 టీఎంసీల నీటిని తరలించేలా నిర్మాణాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఏడాదికి దాదాపు 1.86 టీఎంసీల నీటిని పల్నాడు ప్రాంతంలోని వందలాది గ్రామాలకు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది.

ఇందులో భాగంగా మూడు ఇన్‌టేక్ వెల్స్‌తో పాటు అనుబంధ నిర్మాణాలను చేపట్టింది. విజయపురి సౌత్ ప్రాంతంలో ఈ పనులు కొనసాగుతున్నాయి.

గత ఏడాది కాలంగా ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పటికీ తెలంగాణ నీటిపారుదల శాఖకు, సంబంధిత అధికారులకు, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నాగార్జునసాగర్ సర్కిల్ ఇంజినీర్లు ఈ పనుల గురించి నీటిపారుదల శాఖకు, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వివరాలు

కలెక్టర్, నీటిపారుదల శాఖ నుంచి నివేదికలు

ఈవ్యవహారంపై క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వం నివేదిక కోరినట్లు సమాచారం.

కలెక్టర్ ఇప్పటికే తన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ (సీఈ) కూడా ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సమాచారం.

అయితే ఈ వివాదం కేవలం ఇంజినీర్ల నిర్లక్ష్యానికే పరిమితం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జునసాగర్ రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా కీలకమైన జలాశయం. దీని నీటి వినియోగం, నిల్వ స్థాయులు, డెడ్ స్టోరేజ్ వంటి అంశాలపై గతంలోనూ రెండు రాష్ట్రాల మధ్య పలుమార్లు వివాదాలు తలెత్తాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ చేపట్టిన ప్రాజెక్టులోని ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణాలు డెడ్ స్టోరేజ్ మట్టం కంటే దిగువన ఉండటం తెలంగాణకు మరింత ఆందోళన కలిగిస్తోంది.

వివరాలు

సెలవుపై వెళ్లిన ఇద్దరు సీఈలు.. చర్చనీయాంశంగా పరిణామం

ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB), కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాశారు.

నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరినట్లు సమాచారం. మరోవైపు నీటిపారుదల శాఖలోని కీలక సర్కిళ్లకు చెందిన ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు సెలవుపై వెళ్లడం కూడా చర్చకు దారితీసింది.

ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోని తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కీలక దశలో ఉన్న సమయంలో మంచిర్యాల సీఈ నరసింహమూర్తి సెలవు తీసుకున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని నాగర్‌కర్నూల్ సీఈ విజయభాస్కర్‌రెడ్డి కూడా ఇటీవల సెలవుపై వెళ్లారు.

పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతోనే వీరిద్దరూ సెలవు తీసుకున్నట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

ఇంటెలిజెన్స్ ఆరా.. ఏం జరిగింది?

అయితే వీరి సెలవులకు, ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్న పరిణామాలకు ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై స్పష్టత లేదు. మొత్తంగా ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది.

జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత మంత్రికి కూడా ఈ నిర్మాణాల గురించి ముందుగా తెలియకపోవడం, నాగార్జునసాగర్ నీటిపారుదల శాఖ అధికారులు వాటిని గుర్తించకపోవడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న విషయం తెలిసి కూడా ఎవరైనా దాచిపెట్టారా? దీని వెనుక ఇంకా ఏమైనా పరిణామాలు ఉన్నాయా? అనే కోణాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT