Loading...
Vande Bharat Train Brake Failure: బ్రేకులు పనిచేయని వందే భారత్.. 463 కిలోమీటర్లు ప్రయాణం!
బ్రేకులు పనిచేయని వందే భారత్.. 463 కిలోమీటర్లు ప్రయాణం!

Vande Bharat Train Brake Failure: బ్రేకులు పనిచేయని వందే భారత్.. 463 కిలోమీటర్లు ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ సిస్టమ్ పనిచేయని ఖాళీ వందే భారత్ రైలు ఏకంగా 463 కిలోమీటర్లు ప్రయాణించింది. ఝార్ఖండ్‌లోని హటియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి వెళ్తున్న ఈ రైలులో బ్రేకులు సరిగా పనిచేయడం లేదని లోకో పైలట్లు మార్గమధ్యంలో పలుమార్లు అధికారులను హెచ్చరించారు. అయినప్పటికీ వారి ఫిర్యాదులను పట్టించుకోకుండా రైలును ముందుకు నడిపించారు. ఈ ఘటనపై దక్షిణ తూర్పు రైల్వే (SER) తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది.

వివరాలు

బ్రేకింగ్ సిస్టమ్ అనుసంధానంలో నిర్లక్ష్యం

వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 24న ఖాళీ వందే భారత్ చైర్ కార్ రేక్‌ను మాల్గూడ్స్ రైలు ఇంజిన్ సాయంతో హటియా నుంచి ఝాన్సీకి తరలించాలని అధికారులు నిర్ణయించారు.

నిబంధనల ప్రకారం వందే భారత్ కోచ్‌ల బ్రేకింగ్ సిస్టమ్‌ను మాల్గూడ్స్ ఇంజిన్ బ్రేకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయాలి.

అయితే ఈ ప్రక్రియను సంబంధిత రైల్వే సిబ్బంది సక్రమంగా నిర్వహించలేదు.

దీంతో వందే భారత్ రైలు కోచ్‌లలో బ్రేకులు పనిచేయని పరిస్థితి ఏర్పడింది.

వివరాలు

లోకో పైలట్ల హెచ్చరికలు పట్టించుకోని అధికారులు

హటియా నుంచి రైలు బయలుదేరిన తర్వాత రాంచీ స్టేషన్ సమీపంలో లోకో పైలట్ బ్రేక్ ఫీల్, బ్రేక్ పవర్ పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో బ్రేకింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సెక్షన్ కంట్రోలర్, ట్రాక్షన్ లోకో కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశారు.

అయినప్పటికీ రైలును నిలిపివేయకుండా ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత మురి స్టేషన్‌లో మరో లోకో పైలట్ బాధ్యతలు స్వీకరించారు.

ఆయనకు కూడా ఇదే సమస్య ఎదురైంది. రైలు కోచ్‌ల బ్రేకులు సరిగా పనిచేయడం లేదని అధికారులను హెచ్చరించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో బ్రేకింగ్ సమస్యతోనే రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది.

ADVERTISEMENT

వివరాలు

463 కిలోమీటర్ల తర్వాత బయటపడిన అసలు విషయం

చివరకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఉన్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ (DDU) జంక్షన్‌కు చేరుకున్న తర్వాత రైలును తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో వందే భారత్ రేక్‌లోని అన్ని కోచ్‌ల బ్రేకింగ్ సిస్టమ్‌లు పనిచేయడం లేదని తేలింది.

దీంతో హటియా నుంచి DDU జంక్షన్ వరకు 463 కిలోమీటర్ల ప్రయాణంలో రైలు ఇంజిన్ బ్రేకులు, రీజెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థపైనే ఆధారపడినట్లు వెల్లడైంది.

ADVERTISEMENT

వివరాలు

పలువురు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా?

ఈ ఘటనపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో కోచ్ అండ్ వ్యాగన్ (C&W) నిర్వహణ సిబ్బంది, సంబంధిత స్టేషన్ల సెక్షన్ కంట్రోలర్లు, ట్రాక్షన్ కంట్రోలర్లు, రైలును నడిపిన సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు.

రైలును తరలించే ముందు కోచ్‌ల బ్రేకింగ్ వ్యవస్థను భౌతికంగా ఎందుకు తనిఖీ చేయలేదని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా వందే భారత్‌లోని ఆధునిక బ్రేకింగ్ వ్యవస్థపై లోకో పైలట్లకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు.

వివరాలు

సమగ్ర విచారణకు దక్షిణ తూర్పు రైల్వే ఆదేశం

ఈ ఘటనను తీవ్ర భద్రతా వైఫల్యంగా పరిగణించిన దక్షిణ తూర్పు రైల్వే జోన్.. రాంచీ డివిజన్ డీఆర్ఎంకు సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది.

బాధ్యులైన సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.

ADVERTISEMENT