George Washington Hair Auction: జార్జి వాషింగ్టన్ జుట్టుకు భారీ ధర.. మూడు వెంట్రుకలున్న లాకెట్ రూ.3.7 లక్షలకు వేలం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌కు చెందిన అరుదైన జ్ఞాపిక ఒకటి వేలంలో మంచి ధర పలికింది. ఆయన జుట్టులోని మూడు వెంట్రుకలను భద్రపరిచిన చిన్న లాకెట్‌ను తాజాగా వేలం వేయగా.. 4,000 డాలర్లు (సుమారు రూ.3.7 లక్షలు) లభించాయి. వాషింగ్టన్ మరణించిన తర్వాత లేదా అంతకుముందు ఆయన జుట్టు నుంచి మూడు వెంట్రుకలను సేకరించి ఈ లాకెట్‌లో భద్రపరిచినట్లు చెబుతున్నారు.
వివరాలు
సన్నిహితుడి నుంచి మనవరాలికి చేరిన లాకెట్
జాన్ గాడ్స్‌బై అనే వ్యక్తి జార్జి వాషింగ్టన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. 1799లో వర్జీనియాలోని అలెగ్జాండ్రియా నగరంలో ఆయన వాషింగ్టన్‌కు చివరి విందు ఇచ్చారు.
అదే ఏడాది జార్జి వాషింగ్టన్ కన్నుమూశారు. తాజాగా వేలం వేసిన లాకెట్ తొలుత జాన్ గాడ్స్‌బై వద్ద ఉండేది.
ఆ తర్వాత ఆయన మనవరాలు జులియా టెన్ మెక్ బ్లేయర్‌కు చేరినట్లు రిచ్‌మాండ్ ఆక్షన్ హౌస్ వెల్లడించింది.
ఆమె తన ఇంట్లో ఉంచిన జార్జి వాషింగ్టన్ చిత్రపటం వద్ద ఈ లాకెట్‌ను వేలాడదీసినట్లు తెలిపింది. అనంతరం ఈ పురాతన వస్తువు సేకరణకర్త జాన్ కె. లాటిమర్ వద్దకు చేరింది.
వివరాలు
అమెరికాలో అప్పట్లో వెంట్రుకలను భద్రపరచడం ఓ సంప్రదాయం
తమకు ఇష్టమైన వ్యక్తుల జుట్టు నుంచి వెంట్రుకలను సేకరించి, వాటిని లాకెట్ల వంటి వస్తువుల్లో భద్రపరిచి ప్రదర్శించడం అమెరికాలో ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న సంప్రదాయం.
జార్జి వాషింగ్టన్ కుటుంబంలోనూ ఈ ఆచారం ఉండేదని మౌంట్ వెర్నన్ వెబ్‌సైట్ పేర్కొంది.
గతంలో రూ.37 లక్షలకు అమ్ముడైన మరో లాకెట్
గతంలోనూ జార్జి వాషింగ్టన్‌కు చెందిన ఇలాంటి లాకెట్ వేలంలో భారీ ధర పలికింది. 2021లో ఆయన వెంట్రుకలతో కూడిన మరో లాకెట్ ఏకంగా 40,000 డాలర్లకు (సుమారు రూ.37 లక్షలు) అమ్ముడైంది.
ఇక వాషింగ్టన్ సంతకం చేసిన ఓ లేఖ వేలంలో 1,09,800 డాలర్లు పలకడం విశేషం. మౌంట్ వెర్నన్ ప్రాంతంలోనే జార్జి వాషింగ్టన్ నివసించిన ఇంటిని ప్రస్తుతం మ్యూజియంగా మార్చారు.