Bisleri Water Controversy: బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్‌పై వివాదం.. అన్ని బ్రాండ్లపై కేంద్రం నిఘా!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లరీ (Bisleri) ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలు ఉన్నాయంటూ వెలువడిన నివేదికలు కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న అన్ని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ల ఉత్పత్తులను తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించాయి. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI), బిస్లరీ ఇంటర్నేషనల్ మధ్య నెలకొన్న వివాదం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు సంబంధించిన ఒక నమూనా సురక్షితం కాదని పరీక్షల్లో తేలడంతో సంస్థపై విచారణ జరిపేందుకు FSSAI అనుమతించింది.
వివరాలు
ఒక బ్యాచ్‌లోనే సమస్య.. బిస్లరీ వివరణ ఇదీ!
అయితే, ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో బిస్లరీ నీటి నమూనాలు ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్లు తేలిందని ప్రభుత్వ వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.
అంతకుముందు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన కొన్ని బ్యాచ్‌ల ప్యాకేజ్డ్ వాటర్‌ను FSSAI వెనక్కి తీసుకుంది.
నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులు 2025 సెప్టెంబర్‌లో గోవాలోని తమ ప్లాంట్‌లో తయారైన ఒక బ్యాచ్‌కు చెందినవని బిస్లరీ వెల్లడించింది.
FSSAI సేకరించిన ఆరు నమూనాల్లో ఐదు ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని సంస్థ తెలిపింది.
అయితే, ఒక నమూనాలో మాత్రమే 'బ్రోమేట్' (Bromate) స్థాయిలు నిర్దేశించిన పరిమితికి మించి నమోదైనట్లు వివరించింది.
వివరాలు
అప్పీల్ తర్వాత పరీక్షలు.. ఫలితాలపై బిస్లరీ వివరణ!
ఈ పరీక్షా ఫలితాలపై తాము అప్పీల్ చేయడంతో సంబంధిత నమూనాను రిఫరల్ ల్యాబొరేటరీకి పంపినట్లు బిస్లరీ పేర్కొంది.
అక్కడ నిర్వహించిన పరీక్షల్లో బ్రోమేట్ స్థాయిలు అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని తెలిపింది.
అయితే,అదే నమూనాలో 'పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్'(PAHs)ఉన్నట్లు ప్రయోగశాల ప్రత్యేకంగా గుర్తించిందని వెల్లడించింది.
అనంతరం FSSAI ఆమోదం పొందిన మరో ప్రయోగశాలలోనూ అదే నమూనాను స్వతంత్రంగా పరీక్షించినట్లు బిస్లరీ తెలిపింది.
ఈ పరీక్షల్లో కూడా బ్రోమేట్ స్థాయిలు నిర్దేశిత పరిమితుల్లోనే ఉన్నట్లు నిర్ధారణ అయిందని స్పష్టం చేసింది.
ఈ రెండు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను 2026ఫిబ్రవరిలో నియంత్రణ సంస్థకు సమర్పించినట్లు వెల్లడించింది.
ఆ తర్వాత FSSAI నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఈ వివాదం ముగిసిపోయిందని తాము భావించినట్లు బిస్లరీ వివరించింది.
వివరాలు
ఇతర సంస్థలపైనా FSSAI చర్యలు
మరోవైపు, బిస్లరీతో పాటు మరికొన్ని సంస్థలకు చెందిన ఆహార ఉత్పత్తుల విషయంలోనూ ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతించింది.
ఈ జాబితాలో వసంత్ మసాలా,టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా,మిమాంస ఇండస్ట్రీస్,ఆశా కన్ఫెక్షనరీ సంస్థలు ఉన్నాయి.
అంతేకాకుండా, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించలేదనే కారణంతో ఉర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్‌ఎల్‌పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ సంస్థల లైసెన్స్‌లను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులు సురక్షితం కాదని గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 కింద బిస్లరీతో పాటు సంబంధిత సంస్థలపై విచారణ జరిపేందుకు FSSAI అనుమతి ఇచ్చింది.
తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తుల నాణ్యత, భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.