Loading...
Porsche: బాప్‌రే...ఈ పోర్షే వన్‌ కారు ధర అక్షరాల 1300 కోట్లు!
బాప్‌రే...ఈ పోర్షే వన్‌ కారు ధర అక్షరాల 1300 కోట్లు

Porsche: బాప్‌రే...ఈ పోర్షే వన్‌ కారు ధర అక్షరాల 1300 కోట్లు!

వ్రాసిన వారు Balachander Sharma
Oct 27, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

లగ్జరీ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జర్మనీ సంస్థ పోర్షే ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఎక్కువ కార్లను తయారు చేసి విక్రయించడం కంటే.. కొద్దిమంది సంపన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్లతో భారీ ఆదాయం సంపాదించడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఒక్క కారు ధర దాదాపు 15 మిలియన్ డాలర్లకు చేరుతోంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1,300 కోట్లకు పైమాటే. అయితే ఇది సాధారణంగా విక్రయించే మోడల్ ధర కాదు. కస్టమర్ అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేసే అరుదైన కారు ప్రాజెక్టు విలువ.

Details

ఒక్కొక్కరి అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేక కార్లు

పోర్షేలోని 'సోండర్‌వున్ష్‌' (Sonderwunsch) విభాగం ఇలాంటి ప్రత్యేక కార్ల తయారీపై పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ విభాగం వద్ద 15 ప్రత్యేక ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.

వీటి ధరలు 2 మిలియన్ డాలర్ల కంటే తక్కువ స్థాయి నుంచి దాదాపు 15 మిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి. అంటే కొన్ని కార్ల ధరలు వందల కోట్ల రూపాయల్లోనే ఉంటాయి.

ఇక్కడ కస్టమర్లు తమకు నచ్చిన రంగును ఎంచుకోవడం, అదనపు ఫీచర్లు జోడించుకోవడంతో పని పూర్తికాదు.

అవసరాన్ని బట్టి కొత్త విడిభాగాలను రూపొందించడం, సాంకేతిక మార్పులు చేయడం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేయడం వంటి పనులు కూడా జరుగుతాయి.

దీంతో సాధారణ స్పోర్ట్స్ కారు కూడా ప్రపంచంలో మరెక్కడా లేని ప్రత్యేక వాహనంగా మారుతుంది.

Details

తక్కువ సంఖ్యలోనే.. ఎక్కువ ఆదాయం

ఎంట్రీ లెవల్ మోడళ్లైన మకాన్‌ వంటి కార్ల ఉత్పత్తిని పెంచడం కంటే, అధిక లాభాలు ఇచ్చే ప్రత్యేక మోడళ్లపై పోర్షే ఆసక్తి చూపిస్తోంది.

ఏడాదికి 2 లక్షల కంటే తక్కువ కార్ల విక్రయాలతోనే సంస్థ లాభదాయకతను మెరుగుపరచాలన్నది వ్యూహంలో కీలక అంశం.

పూర్తిగా కస్టమర్ కోసం తయారయ్యే కార్లతో పాటు, పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేసే 'ఫ్యూ-ఆఫ్‌' మోడళ్లపైనా సంస్థ దృష్టి పెట్టింది.

అలాగే భవిష్యత్తులో అత్యంత శక్తిమంతమైన 911 మోడళ్ల ధరలు, ఎంట్రీ లెవల్ 911 ధరతో పోలిస్తే 200 శాతానికి పైగా ఎక్కువగా ఉండే అవకాశాలను పరిశీలిస్తోంది.

ADVERTISEMENT

Details

పాత కార్లతోనూ భారీ వ్యాపారం

పోర్షే తన పాత కార్ల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తోంది. Carrera GT సూపర్‌కార్లను ఫ్యాక్టరీ స్థాయిలో పునరుద్ధరించే కార్యక్రమం ఇందుకు ఉదాహరణ.

ఈ కార్లలోని V10 ఇంజిన్ సహా యాంత్రిక వ్యవస్థలను అసలు ఫ్యాక్టరీ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఒక్కో కారు పునరుద్ధరణకు 5 లక్షల నుంచి 8 లక్షల డాలర్ల వరకు ఖర్చవుతుంది.

అంటే వాహనం ధరకు అదనంగా సుమారు రూ.4.4 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వెచ్చించాల్సి రావచ్చు. మొత్తానికి పోర్షే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

భారీ సంఖ్యలో కార్లను విక్రయించడం ఒక్కటే లక్ష్యం కాదు. ప్రత్యేకత, వ్యక్తిగత అభిరుచి, అధిక పనితీరుకు విలువ ఇచ్చే కస్టమర్లకు సేవలందిస్తూ, తక్కువ అమ్మకాలతోనూ ఎక్కువ ఆదాయం సంపాదించడమే లక్ష్యం.

ADVERTISEMENT