50 Year Airport Concession : తిరుపతి, వారణాసి సహా 11 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేంద్రం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అందుబాటు ధరల్లో విమాన ప్రయాణం అందుబాటులోకి రావడం,ప్రజల ఆదాయాలు పెరగడం,బిజీ జీవనశైలి వంటి కారణాలతో విమానాశ్రయాల్లో రద్దీ రోజురోజుకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాల్లో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తిరుపతి, వారణాసి సహా దేశంలోని 11 విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP)విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రతిపాదన సిద్ధమైంది. ఆగస్టు 4న జరిగిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC)సమావేశంలో ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. సుమారు 50 ఏళ్ల రాయితీ కాలానికి ఈ విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కేంద్రం యోచిస్తోంది.
వివరాలు
రూ.8,622 కోట్ల పెట్టుబడులు
కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం.. ఈ 11 విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణ కోసం ప్రైవేటు సంస్థలు సుమారు రూ.8,622 కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
ఇందుకోసం విమానాశ్రయాలను మొత్తం ఐదు బండిల్స్‌గా విభజించారు.ఒక్కో బండిల్‌ను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించే విధానం రూపొందించారు.
భువనేశ్వర్-హుబ్బళ్లి బండిల్‌కు అత్యధికంగా రూ.2,725కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా.
వారణాసి-గయా-కుషీనగర్ బండిల్‌కు రూ.2,467కోట్లు, రాయ్‌పూర్-ఔరంగాబాద్ బండిల్‌కు రూ.1,496 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని తెలుస్తోంది.
ఇక తిరుపతి-తిరుచిరాపల్లి విమానాశ్రయాలను ఒక బండిల్‌గా రూపొందించారు.
వీటి అభివృద్ధి,విస్తరణకు సుమారు రూ.1,411కోట్లు అవసరమవుతాయని అంచనా.
అమృత్‌సర్-కాంగ్రా బండిల్‌కు రూ.523కోట్ల పెట్టుబడి అవసరమవుతుంది.
పెద్ద విమానాశ్రయాలను చిన్న విమానాశ్రయాలతో కలిపి బండిల్స్‌గా రూపొందించడం ద్వారా ప్రైవేటు సంస్థలకు ప్రాజెక్టులను ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాలు
ఒకే సంస్థకు ఎక్కువ విమానాశ్రయాలు దక్కకుండా..
దేశంలోని విమానాశ్రయాల నిర్వహణ కొన్ని సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఒకే బిడ్డర్‌కు ఎన్ని విమానాశ్రయ బండిల్స్ కేటాయించాలనే అంశంపై పరిమితి విధించే ఆలోచనలో ఉంది.
ఒకే సంస్థకు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు దక్కితే.. వాటి కోసం భారీగా అప్పులు చేయాల్సి రావడం, తద్వారా సంస్థపై ఆర్థిక భారం పెరగడం వంటి సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.
అయితే ఒక్క ప్రైవేటు సంస్థకు గరిష్ఠంగా ఎన్ని బండిల్స్ ఇవ్వాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రైవేటు సంస్థలకు విమానాశ్రయాలను అప్పగించిన తర్వాత ఇప్పటికే ఆమోదించిన మూలధన వ్యయంతో పాటు.. విమానాశ్రయాల సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అదనపు పెట్టుబడులు కూడా పెట్టాల్సి ఉంటుంది.
వివరాలు
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మరింత విస్తరణ
విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.
2019లో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా.. అదానీ గ్రూప్ అన్ని విమానాశ్రయాలను దక్కించుకుంది.
మరోవైపు దేశీయ విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్, దిల్లీ విమానాశ్రయాల విస్తరణకు కూడా భారీగా పెట్టుబడులు రానున్నాయి.
హైదరాబాద్ విమానాశ్రయ విస్తరణ కోసం సుమారు రూ.13,800 కోట్లు, దిల్లీ విమానాశ్రయ విస్తరణ కోసం రూ.5,600 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది.