Loading...
Pan IIT Summit : ఏపీకి టెక్నాలజీ బూస్ట్‌.. అమరావతిలో పాన్‌ఐఐటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్
ఏపీకి టెక్నాలజీ బూస్ట్‌.. అమరావతిలో పాన్‌ఐఐటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్

Pan IIT Summit : ఏపీకి టెక్నాలజీ బూస్ట్‌.. అమరావతిలో పాన్‌ఐఐటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతిలో పాన్‌ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎన్‌ఏసీఐఎన్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ప్రభాత్‌ కుమార్‌ తెలిపారు. ఇందుకోసం అమరావతిలో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినట్లు చెప్పారు. పాన్‌ఐఐటీ అలుమ్ని ఇండియా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న తొలి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇదేనని వెల్లడించారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైస్‌ ఛైర్మన్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ రిజిస్ట్రార్‌ అమితాబ్‌ రంజన్, కన్వీనర్‌ రామునాయుడితో కలిసి ప్రభాత్‌ కుమార్‌ మాట్లాడారు.

వివరాలు 

ప్రతి ఏడాది ఈ సమిట్‌ను నిర్వహించే యోచన 

దేశంలోని 23 ఐఐటీలకు చెందిన పూర్వ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాన్‌ఐఐటీ అలుమ్ని ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికత, ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో పాన్‌ఐఐటీ ఏపీ సమిట్‌-2026ను నిర్వహించనుంది.

విజయవాడలో అక్టోబరు 3న జరగనున్న ఈ సదస్సుకు'స్వర్ణాంధ్ర విజన్‌-2047 కోసం ఆవిష్కరణలకు ఊతం' అనే ఇతివృత్తాన్ని ఖరారు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఇకపై ప్రతి ఏడాది ఈ సమిట్‌ను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రభాత్‌ కుమార్‌ తెలిపారు.

రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత అభివృద్ధి, ఆవిష్కరణలను వేగవంతం చేయడమే సమిట్‌ ప్రధాన లక్ష్యమని వివరించారు.

ఈ వేదిక ద్వారా విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు,సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు,స్టార్టప్‌ ప్రతినిధులు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురానున్నట్లు చెప్పారు.

వివరాలు 

సమిట్‌కు 500 మందికి పైగా ప్రతినిధులు

సమిట్‌కు 500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.

సదస్సులో డీప్‌టెక్, కృత్రిమ మేధ (ఏఐ),మెషీన్‌ లెర్నింగ్,మెడ్‌టెక్,ఫార్మా,హెల్త్‌కేర్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, గ్రీన్‌ ఎనర్జీ, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తదితర కీలక రంగాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

సమిట్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని ప్రభాత్‌ కుమార్‌ తెలిపారు.

ఏఐ, డీప్‌టెక్, క్వాంటమ్‌ టెక్నాలజీ, ఆవిష్కరణలు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ అవకాశాలను వినియోగించుకునేందుకు సాంకేతికత, పెట్టుబడులు, పరిశోధన, స్టార్టప్‌ రంగాలను అనుసంధానించడం సమిట్‌ ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు.

సమావేశంలో పాన్‌ఐఐటీ ఏపీ సమిట్‌ ఛైర్‌ సుధాకర్‌ గాండే కూడా పాల్గొన్నారు.

ADVERTISEMENT