Karnataka: 'ధతూరా' విక్రయాలు.. అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు సస్పెండ్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో క్విక్ కామర్స్ సంస్థలపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. విషపూరితమైన ధతూరా (Datura) పండ్లు, విత్తనాలను ఆహార వినియోగం కోసం తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు సంబంధించిన ఫుడ్ లైసెన్సులను కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సస్పెండ్ చేసింది. ధతూరా ఉత్పత్తులను ఈ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో అధికారులు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ధతూరా పండ్లు, విత్తనాలు అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వీటికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం
అయితే ధతూరా విషపూరితమైనది కావడంతో దీనిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ధతూరా పండ్లు, విత్తనాలతో కూడిన ప్యాకెట్లపై ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్నట్లు విచారణలో తేలింది.
అంతేకాకుండా ఈ ఉత్పత్తులను గోడౌన్లలో నిల్వ చేసి, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై ఆయా సంస్థల ప్రతినిధులు అధికారుల ఎదుట హాజరయ్యారు.
అమెజాన్ ఎలాంటి సమాధానం సమర్పించలేదని అధికారులు తెలిపారు. ఇన్‌స్టామార్ట్ మాత్రం తాము తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు మరింత సమయం కావాలని కోరింది.
వివరాలు
సంస్థలు ఇచ్చిన వివరణలు, సమాధానాలు సంతృప్తికరం లేవు: ఆహార భద్రతా శాఖ
మరోవైపు బిగ్‌బాస్కెట్ తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ధతూరా పండ్ల విక్రయాలను నిలిపివేసినట్లు తెలిపింది.
భవిష్యత్తులో ఉత్పత్తుల లేబులింగ్‌లో 'మనుషుల వినియోగానికి కాదు' అనే హెచ్చరికను స్పష్టంగా పేర్కొంటామని వెల్లడించింది.
అయితే సంస్థలు ఇచ్చిన వివరణలు, సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఆహార భద్రతా శాఖ పేర్కొంది.
ధతూరా వంటి ఉత్పత్తులను ఆహారంగా చూపిస్తూ నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించింది.
అయితే సంస్థలు తమ వివరణను సమర్పించి, అధికారుల ఎదుట విచారణకు హాజరైన తర్వాత ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశం ఉంటుంది.
వివరాలు
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఆదేశం
అంతేకాకుండా ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ధతూరా ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సరఫరాదారులు, విక్రేతలకు సంబంధించిన లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది.
ధతూరా పండ్లు, విత్తనాలను ఆహారం లేదా మానవ వినియోగం కోసం విక్రయిస్తున్నట్లు చూపించే అన్ని ఆన్‌లైన్ లిస్టింగ్‌లు, ప్రకటనలను వెంటనే తొలగించాలని లేదా నిలిపివేయాలని సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను ఆదేశించింది.