Loading...
TVK: విజయ్‌ టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు.. 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే!
విజయ్‌ టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు.. 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే!

TVK: విజయ్‌ టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు.. 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.13.3 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందాయి. ఈ మొత్తంలో దాదాపు 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే వచ్చినట్లు భారత ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించిన వివరాల ద్వారా వెల్లడైంది. రాష్ట్ర క్రీడలు,ప్రజాపనుల శాఖ మంత్రి ఆధవ్‌ అర్జున,మరో మంత్రి ఆర్‌వీ రంజిత్‌కుమార్‌ ఈ విరాళాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదిక ప్రకారం..ఆధవ్‌ అర్జున రూ.8.2కోట్లను పార్టీకి విరాళంగా ఇచ్చారు. రంజిత్‌కుమార్‌ రూ.5 కోట్లను అందించారు. దీంతో టీవీకేకు వచ్చిన మొత్తం విరాళాల్లో అర్జున వాటా 60 శాతానికి మించిపోయింది. పార్టీకి అత్యధికంగా విరాళం ఇచ్చిన వ్యక్తిగా ఆయన నిలిచారు.

వివరాలు 

పార్టీకి అందిన మొత్తం రూ.13.3 కోట్ల విరాళం 

ఈ ఇద్దరు మంత్రులు ఇచ్చిన విరాళాలతో పాటు మరో రెండు విరాళాలు కూడా టీవీకేకు అందాయి.

తూత్తుకుడి జిల్లా లయన్స్‌ టౌన్‌లో ఉన్న స్నో షో సంస్థ రూ.5లక్షలను డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా అందించింది.

అదే చిరునామాలో నమోదైన స్నో ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ సంస్థ కూడా మరో రూ.5 లక్షలను డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో ఇచ్చింది.

ఈ నాలుగు విరాళాలను కలిపితే పార్టీకి అందిన మొత్తం రూ.13.3 కోట్లుగా ఉంది.

మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్నాడీఎంకేకు సుమారు రూ.161.35 కోట్ల స్వచ్ఛంద విరాళాలు వచ్చినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి.

ఈ మొత్తంలో టైగర్‌ అసోసియేట్స్‌ సంస్థ అత్యధికంగా రూ.135 కోట్లను అందించి, ఆ పార్టీకి అతిపెద్ద విరాళదారుగా నిలిచింది.

వివరాలు 

డీఎంకేకు సుమారు రూ.191.19 కోట్ల విరాళాలు

ఇదే ఆర్థిక సంవత్సరంలో డీఎంకేకు సుమారు రూ.191.19 కోట్ల విరాళాలు అందాయి.

ఆ పార్టీకి కూడా టైగర్‌ అసోసియేట్స్‌ సంస్థే అత్యధికంగా విరాళం ఇచ్చింది. ఈ సంస్థ డీఎంకేకు రూ.125 కోట్లను అందించింది.

కోల్‌కతాకు చెందిన ఈ లాటరీ సంస్థకు, తమిళనాడులో లాటరీ వ్యాపారం నిర్వహించే శాంటియాగో మార్టిన్‌కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కంపెనీ రికార్డులు సూచిస్తున్నాయి.

టైగర్‌ అసోసియేట్స్‌లో నియమిత భాగస్వామిగా ఉన్న సుబ్బయన్‌ నాగరాజన్‌.. మార్టిన్‌తో చాలాకాలంగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

ఎన్నికల బాండ్లను రద్దు చేసిన సుప్రీంకోర్టు

కాగా, ఎన్నికల నిధుల విషయంలో కీలక పరిణామంగా 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసింది.

అంతకుముందు ఈ పథకం కింద అత్యధికంగా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన సంస్థగా శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ నిలిచింది.

పథకం రద్దు తర్వాత బహిర్గతమైన వివరాల ప్రకారం.. ఈ సంస్థ ఎన్నికల బాండ్ల ద్వారా డీఎంకేకు రూ.509 కోట్ల విరాళాలను అందించింది.

ADVERTISEMENT