Telangana Rains: తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. నిండుతున్న ప్రాజెక్టులు.. రైతుల్లో ఆనందం
ఈ వార్తాకథనం ఏంటి
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోయడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. అయితే, భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులను కూడా సృష్టిస్తున్నాయి. సింగరేణి పరిధిలోని పలు ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
వివరాలు
పెద్దశంకరంపేటలో 11 సెంటీమీటర్ల వర్షపాతం
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాపైనా వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది.
ప్రాజెక్టులకు భారీగా వరద
వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా నీరు చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులకు చేరువైంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 1,401 అడుగులకు చేరుకుంది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోనూ నీటి నిల్వ గణనీయంగా పెరిగింది. జలాశయంలో నీటిమట్టం 44 టీఎంసీలను దాటింది.
వివరాలు
ప్రాజెక్టులకు భారీగా వరద
కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 17 గేట్లను ఎత్తి 74 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి కూడా వరద ఉద్ధృతి పెరిగింది. భారీగా వరద నీరు చేరుతుండటంతో 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
భారీ వర్షాల ప్రభావం సింగరేణి బొగ్గు గనులపైనా పడింది. ఇల్లందు, మణుగూరు ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
వివరాలు
మరో నాలుగు రోజులు వర్షాలు
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు, అంటే ఆగస్టు 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిస్థితులను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.