WAPL Auction Today: మహిళా క్రికెటర్లకు బిగ్ ఛాన్స్.. నేడు డబ్ల్యూఏపీఎల్ వేలం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రారంభించిన మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. విజయవాడ వేదికగా మంగళవారం లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో నాలుగు ఫ్రాంఛైజీలు మహిళా క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు పోటీపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 191 మంది క్రీడాకారిణులు వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్ఠంగా 20 మంది మహిళా క్రికెటర్లను జట్టులోకి తీసుకోవచ్చు. దీంతో నాలుగు జట్లలో కలిపి మొత్తం 80 మంది క్రికెటర్లకు అవకాశం లభించనుంది.
వివరాలు
ఒక్కో జట్టుకు రూ.15 లక్షల బడ్జెట్
క్రీడాకారిణుల కొనుగోలు కోసం ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వేలం కోసం మహిళా క్రికెటర్లను గ్రేడ్-ఎ, గ్రేడ్-బి కేటగిరీలుగా విభజించారు.
గ్రేడ్-ఎ క్రీడాకారిణులకు కనీస ధర రూ.50 వేలుగా, గ్రేడ్-బి క్రీడాకారిణులకు కనీస ధర రూ.30 వేలుగా నిర్ణయించారు.
దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు, మహిళల ప్రిమియర్ లీగ్‌లో ఆడిన క్రీడాకారిణులు, సీనియర్, అండర్-23 విభాగాల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అమ్మాయిలను గ్రేడ్-ఎలో చేర్చారు.
ఈ కేటగిరీలో మొత్తం 45 మంది ఉన్నారు. జిల్లా, జోనల్ స్థాయిలో ఆడిన మరో 146 మంది క్రికెటర్లు గ్రేడ్-బిలో ఉన్నారు.
వేలంలో భారత జట్టు స్పిన్నర్ శ్రీచరణి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
వివరాలు
సెప్టెంబర్ 15 నుంచి డబ్ల్యూఏపీఎల్
మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా డబ్ల్యూఏపీఎల్ తొలి సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు లీగ్ నిర్వహించనున్నారు.
జట్ల పేర్లు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా నాలుగు ఫ్రాంఛైజీలకు పేర్లు పెట్టారు.
అత్యధికంగా రూ.89 లక్షల బిడ్‌తో ఫ్రాంఛైజీని దక్కించుకున్న ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రామోజీ గ్రూప్) తమ జట్టుకు 'అమరావతి ఈ ఛాంపియన్స్' అని పేరు పెట్టింది.
గ్యారిసన్ కన్‌స్ట్రక్షన్స్ ఫ్రాంఛైజీకి 'రాయలసీమ జెన్ స్టార్స్' అనే పేరు పెట్టగా.. ఒరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ జట్టుకు 'వైజాగ్ ఫైర్ బర్డ్స్' అని నామకరణం చేశారు.
వివరాలు
టైటిల్ పై కన్నేసిన ఉషోదయ ఫ్రాంఛైజీ
ఎన్‌ఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ తమ జట్టుకు 'గోదావరి గోల్డెన్ ఈగల్స్' అనే పేరును ఖరారు చేసింది.
ఇదిలా ఉండగా.. టీజీ20 తొలి సీజన్‌లో ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మహిళల ప్రిమియర్ లీగ్‌లోనూ తమ జట్టు సత్తా చాటాలని ఉషోదయ ఫ్రాంఛైజీ లక్ష్యంగా పెట్టుకుంది.