China: చైనా కీలక నిర్ణయం.. చాంగ్‌ఈ-7 చంద్రయాన్ ప్రయోగం వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
చైనా ప్రతిష్ఠాత్మక చాంగ్‌ఈ-7 చంద్రయాన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నీటి మంచు జాడలను గుర్తించడంతో పాటు అక్కడి పర్యావరణం, వనరులపై కీలక పరిశోధనలు నిర్వహించేందుకు ఈ మిషన్‌ను చేపట్టాలని నిర్ణయించారు. అయితే,ఈ ఏడాదికి నిర్దేశించిన ప్రయోగ విండోలో మిషన్‌ను చేపట్టడం సాధ్యం కాదని చైనా ఆదివారం ప్రకటించింది. దక్షిణచైనాలోని హైనాన్ ద్వీపంలో ఉన్న వెన్‌చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రానున్న రోజుల్లో చాంగ్‌ఈ-7ను ప్రయోగించేందుకు గత కొన్ని వారాలుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే,ప్రస్తుతం ప్రయోగానికి అవసరమైన పరిస్థితులు అనుకూలంగా లేవని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ సంక్షిప్త ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాదికి నిర్ణయించిన ప్రయోగ సమయ పరిధిలో మిషన్‌ను నిర్వహించలేమని స్పష్టం చేసింది.
వివరాలు
పూర్తి విజయమే లక్ష్యంగా..
చాంగ్‌ఈ-7 ప్రయోగాన్ని వాయిదా వేయడానికి ముందు సమగ్రంగా పరిశీలన జరిపినట్లు చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ తెలిపింది.
జాగ్రత్త, విశ్వసనీయత, మిషన్ పూర్తి విజయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అయితే, అసలు ప్రయోగాన్ని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే నిర్దిష్ట కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
వివరాలు
కీలక సాంకేతికతలపై దృష్టి..
చాంగ్‌ఈ-7.. చైనా చంద్ర అన్వేషణ కార్యక్రమంలో ఏడో మిషన్. ఈ ప్రయోగం ద్వారా పలు కీలక సాంకేతికతలను పరీక్షించి, వాటిలో పురోగతి సాధించడాన్ని ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకున్నారు.
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఎప్పుడూ సూర్యకాంతి పడని బిలాలను పరిశీలించడంతో పాటు అక్కడి పర్యావరణ పరిస్థితులు, సహజ వనరులపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఈ మిషన్‌ను రూపొందించారు.
చంద్రుడిపై నీటి మంచు అన్వేషణ ఈ మిషన్‌లో అత్యంత కీలకమైన అంశంగా భావిస్తున్నారు.
ముఖ్యంగా దక్షిణ ధ్రువ ప్రాంతంలోని నీటి మంచు నిల్వలపై సమాచారం సేకరించడం భవిష్యత్ చంద్ర అన్వేషణలకు ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది.
ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపై భవిష్యత్ మిషన్లకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
చాంగ్‌ఈ-6తో చారిత్రక విజయం..
'చాంగ్‌ఈ' అనే పేరు చైనా పురాణాల్లోని చంద్ర దేవతను సూచిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చాంగ్‌ఈ-6 మిషన్ 2024లో చారిత్రక విజయాన్ని సాధించింది.
ఆ వ్యోమనౌక చంద్రుడి అవతలి వైపు నుంచి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి విజయవంతంగా భూమికి తీసుకొచ్చింది.
ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి అవతలి వైపు నుంచి నమూనాలను భూమికి తీసుకురావడంతో ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనల్లో కీలక మైలురాయిగా నిలిచింది.
చాంగ్‌ఈ-7ను వాయిదా వేసినప్పటికీ.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు, నీటి మంచు అన్వేషణ, భవిష్యత్ చంద్ర మిషన్లకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధిపై చైనా దృష్టి కొనసాగుతోంది.