Pawan Kalyan: ఏపీలో పచ్చదనం కోసం పవన్ భారీ ప్లాన్.. 2.06 కోట్ల సీడ్ బాల్స్‌తో సరికొత్త కార్యక్రమం!
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం మేర గ్రీన్ కవర్ ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందులో భాగంగా విత్తన బంతులు (సీడ్ బాల్స్) వెదజల్లే కార్యక్రమాన్ని ముమ్మరం చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూలపాడులోని ఎకోపార్క్‌లో తొలి విత్తన బంతిని తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20,929 హెక్టార్ల విస్తీర్ణంలో 2.06 కోట్లకు పైగా సీడ్ బాల్స్‌ను వెదజల్లినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. క్షీణించిన అటవీ ప్రాంతాల్లో తిరిగి పచ్చదనాన్ని తీసుకురావడమే లక్ష్యంగా డ్రోన్ల సాయంతో విత్తన బంతులను వెదజల్లుతున్నామని పేర్కొన్నారు.
వివరాలు
ఇప్పటికే 85శాతం లక్ష్యాన్ని పూర్తి చేశాం
ప్రస్తుత సీజన్‌లో మొత్తం 2.82 కోట్ల విత్తన బంతులను చల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 85 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు.
అనంతపురం, కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోందని చెప్పారు.
విత్తన బంతులు వెదజల్లిన ప్రాంతాల్లో మొలకెత్తిన విత్తనాల శాతం, మొక్కల ఎదుగుదల తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
కేవలం విత్తనాలు వెదజల్లడంతో కార్యక్రమం పూర్తయినట్లు కాకుండా.. అవి మొలకెత్తి మొక్కలుగా ఎదిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
వివరాలు
కేరళకు చేరుకున్న పవన్ కల్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రాత్రి కేరళ చేరుకున్నారు.
త్రిశ్శూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో కుడి భుజానికి చికిత్స చేయించుకోనున్నారు.
శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నేరుగా ఆయుర్వేద వైద్యశాలకు వెళ్లారు.