Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే రింగ్ రైలు.. భూసేకరణ సులభం చేసేందుకు ఎలైన్‌మెంట్‌లో మార్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రవాణా ఆధారిత అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ఉత్తర భాగం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ భాగం నిర్మాణానికి రూ.11,517.51 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. జులై 30న ఈ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. కేంద్రానికి తాజాగా సమర్పించిన ఎలైన్‌మెంట్‌తో పాటు డీపీఆర్‌లో పొందుపరిచిన ఇతర సాంకేతిక అంశాలను రైల్వే బోర్డు పరిశీలించనుంది. అనంతరం ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకోనుంది. రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు మొత్తం ఎలైన్‌మెంట్‌ను ఏడాది క్రితమే ఖరారు చేశారు. ఉత్తర, దక్షిణ భాగాలను కలిపి మొత్తం 392 కిలోమీటర్ల పొడవున ఈ రింగ్ రైలును నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
వివరాలు
ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుగుణంగా ఎలైన్‌మెంట్‌లో మార్పులు
డీపీఆర్ తుది దశకు చేరుకున్న సమయంలో భూసేకరణ అంశం ప్రాజెక్టులో కీలకంగా మారింది.
తొలుత ఖరారు చేసిన రింగ్ రైలు ఎలైన్‌మెంట్ ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది.
రింగ్ రైలు, ఆర్‌ఆర్‌ఆర్ వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో రెండింటి కోసం విడివిడిగా భూసేకరణ చేయాల్సి వస్తుందని, ఇది ఆచరణలో ఇబ్బందికరంగా మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఆర్‌ఆర్‌ఆర్ పక్క నుంచే రింగ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తే భూసేకరణ ప్రక్రియ సులభతరమవుతుందని సీఎం వివరించినట్లు తెలుస్తోంది.
రీజినల్ రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుగుణంగా రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఉత్తర భాగం డీపీఆర్ పూర్తి.. దక్షిణ భాగంపై స్పష్టత రావాల్సి ఉంది
రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు సర్వేకు కేంద్ర ప్రభుత్వం 2023 జూన్‌లోనే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉత్తర భాగానికి సంబంధించిన డీపీఆర్ పూర్తై కీలక దశకు చేరుకుంది.
అయితే దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌పై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రభుత్వం, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సమన్వయంతో దక్షిణ భాగంతో పాటు మొత్తం రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం.