రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 50వేల మంది విద్యార్థులకు సాయం.. రిలయన్స్ బోర్డులోకి తనయులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశం అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ ముకేష్ అంబానీ, పెట్టుబడి దారులు, మార్కెట్ పరిశీలకులను ఉద్ధేశించి మాట్లాడారు. భారతదేశ ఆర్థిక వృద్ధిపై అంబానీ సుదీర్ఘంగా వివరించారు. ఇందులో రిలయన్స్ సాధించిన ఘనతలు, భవిష్యత్ ప్రణాళికలను ఆయన వెల్లడించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని, 2035 నాటికి నెట్ జీరో లక్ష్యాలను అందుకోవాలనుకుంటున్నట్లు ముకేష్ అంబానీ పేర్కొన్నారు. బీపీ భాగస్వామ్యంతో కలిసి కేజీబీ బ్లాక్-6లో 20 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తిని పునరుద్ధరించామన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, క్రీడలు, మహిళా సాధికారిత కోసం పాటుపడుతున్నామని, వచ్చే 10 ఏళ్లలో 50వేల మంది విద్యార్థులకు తోడ్పాటునందిస్తామని చెప్పారు.
బీమా రంగంలోకి జియో ఫైనాల్షియల్ సర్వీసెస్
మరోవైపు జియో ఫైనాల్షియల్ సర్వీసెస్ ద్వారా బీమా రంగంలోకి అడుగుపెడుతామని, దీని ద్వారా సాధారణ, ఆరోగ్య బీమా సేవలను అందిస్తామని చెప్పారు. రిలయన్స్ రిటైల్ తరహాలోనే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందన్నారు. గతేడాది రిలయన్స్ 2,60,364 కోట్లు వార్షిక ఆదాయన్ని ఆర్జించిందని, కతార్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడులతో కలిసి రిలయన్స్ రిటైల్ విలువ రూ.8.28 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లు వివరించారు. రిలయన్స్ రిటైల్ లో గతేడాది 100 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయని, 78 కోట్ల మంది తన స్టోర్లను సందర్శించారని ఈశా అంబానీ చెప్పారు. డిజిటల్, నూతన ఈ కామర్స్ వ్యాపారం నుంచి రూ.50,000 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం స్టోర్ల సంఖ్య 18,040 కి పెరిగిందన్నారు.
రిలయన్స్ జియోలో 3.9లక్షల మంది ఉద్యోగులు
ఇక రిలయన్స్ బోర్డులోకి బిలియనీర్ వారసులు ఈశా, ఆకాశ్, అనంత్ అంబానీ చేరారు. వీరిని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లగా నియమిస్తూ కంపెనీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రిలయన్స్ కంపెనీలో మొత్తం 3.9 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 19 గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్ ఫైబర్ సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా, దేశంలో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటినట్లు ముకేష్ అంబానీ స్పష్టం చేశారు.