Prices of Soaps: వినియోగదారులకు మరో ఎదురుదెబ్బ.. సబ్బులతో పాటు టీ పొడి ధరలూ పెరిగాయ్
హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), విప్రో సహా పలు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజాలు సబ్బుల ధరలను 7-8శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి ప్రధాన కారణంగా పామాయిల్ ధరల్లో భారీ పెరుగుదల అని పేర్కొంది. సబ్బుల తయారీలో కీలకమైన పామాయిల్ ధర ఈ ఏడాది ప్రారంభం నుండి 30శాతం పైగా పెరగడంతో ప్రముఖ సంస్థలు ధరలను సవరించాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరలను సర్దుబాటు చేయడం తప్పనిసరి అని విప్రో కన్జ్యూమర్ కేర్ సీఈఓ నీరజ్ ఖత్రి వివరించారు. లక్స్ (5 సబ్బుల ప్యాక్): రూ.145 నుండి రూ.155, లైఫ్‌బాయ్ (5 సబ్బుల ప్యాక్): రూ.155 నుండి రూ.165, పియర్స్ (4 సబ్బుల ప్యాక్): రూ.149 నుండి రూ.162 వరకు పెరిగాయి.
వినియోగదారులపై అదనపు భారం
వాతావరణ ప్రతికూలతల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో టీ పొడి ధరలను కూడా పెంచే దిశగా టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, హెచ్‌యూఎల్ నిర్ణయం తీసుకున్నాయి. ముడి సరుకుల ధరల పెరుగుదల ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులపై తక్షణ ప్రభావం చూపుతూ, వినియోగదారులపై అదనపు భారం కలిగిస్తోంది. సబ్బులు, టీ వంటి రోజువారీ వినియోగ ఉత్పత్తుల ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు మళ్లీ బడ్జెట్‌ను పునర్నిర్మించుకోవలసి ఉంటోంది.