క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులో రూ.2000 నోట్లను స్వీకరించం: అమెజాన్ ప్రకటన
ఆన్‌లైన్ రిటైలర్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19, 2023 నుంచి క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) చెల్లింపులు లేదా క్యాష్‌లోడ్‌ల కోసం రూ.2,000 నోట్లను స్వీకరించబోమని తెలిపింది. రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు సమీపిస్తుండగా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ఆదేశాలకు మేరకు తాము 19వ తేదీ నుంచి రూ.2వేల నోట్ల స్వీకరణను ఆపేస్తున్నట్లు అమెజాన్ తన ఎఫ్ఏక్యూలో తెలిపింది. సెప్టెంబరు 30, 2023 వరకు, ప్రజలు రూ. 2,000 నోట్లను తమ ఖాతాల్లో జమ చేసుకోవడానికి అవకాశం ఉంది.
2016 నవంబర్‌లో రూ.2వేట్లను ప్రవేశపెట్టిన ఆర్‌బీఐ
వస్తువును థర్డ్-పార్టీ కొరియర్ భాగస్వామి ద్వారా డెలివరీ చేస్తే, రూ. 2,000 కరెన్సీ నోట్ల స్వీకరణ అనేది ఆయా డెలివరీ సంస్థ పాలసీ ప్రకారం ఉంటుందని అమెజాన్ తెలిపింది. 2016 నవంబర్‌లో రూ.2000 డినామినేషన్ నోట్లను ప్రవేశపెట్టారు. రూ. 2,000 నోట్లను మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెలామణి నుండి తీసివేసింది. ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్ బీఐ పేర్కొంది.