Page Loader
Budget 2025: పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? నిపుణులు ఏమంటున్నారు?
పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? నిపుణులు ఏమంటున్నారు?

Budget 2025: పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? నిపుణులు ఏమంటున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 1 సమీపిస్తుండగా, కేంద్ర బడ్జెట్‌పై మధ్యతరగతి వర్గంలో అంచనాలు, ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థను పురోగమించేందుకు పన్ను మినహాయింపులు అందిస్తారని, ఈ విధంగా వేతన జీవులకు ఉపశమనం కల్పిస్తారన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇది శ్లాబుల రూపంలోనా లేదా స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూపంలోనా అన్నది ఇప్పటికీ ఊహాగానాలు మాత్రమే . ఈ సమయంలో ఆదాయపు పన్ను విషయంలో ఒక కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈసారి బడ్జెట్‌లో పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) రద్దు చేయడం గురించి కీలక ప్రకటన వెలువడే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనాలు కూడా వెలువడుతున్నాయి.

వివరాలు 

కొత్త విధానానికి ఎక్కువ మందిని ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో కొత్త, పాత పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. 2020 బడ్జెట్‌లో కేంద్రం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, కొత్త విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. శ్లాబుల మార్పు, ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి పెంపు వంటి మార్పులు కొత్త పన్ను విధానంలోనే చేపట్టారు. కొత్త విధానానికి ఎక్కువ మందిని ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం. దీన్ని బట్టి ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో, ఈసారి బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేస్తూనే పాత పన్ను విధానానికి ముగింపు ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

కొత్త పన్ను విధానాన్ని దాదాపు 70 శాతం మంది ఎంచుకున్నారు 

అయితే, పాత పన్ను విధానం తొలగింపు అంశంపై నిపుణులలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకోవడం కష్టమవుతుండటంతో, లెక్కించడం సులభమైన కొత్త పన్ను విధానాన్ని కొనసాగించడం మేలని టాక్స్‌ నిపుణులు సూచిస్తున్నారు. కొత్త పన్ను విధానాన్ని దాదాపు 70 శాతం మంది ఎంచుకున్నారని, వీరిని ఇంకా కొత్త విధానానికి ఆకర్షించేందుకు మరిన్ని మార్పులు అవసరమని భావిస్తున్నారు. అయితే, ఒకేసారి పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తే రియల్‌ ఎస్టేట్‌ రంగంపై, పన్ను ఆదా పథకాలపై ప్రభావం ఉంటుందని మరికొంత మంది నిపుణులు అభిప్రాయపడ్డారు.

వివరాలు 

పాత పన్ను విధానానికి ముగింపు సంకేతం

పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు ఇప్పటికే దీర్ఘకాలిక పన్ను ప్రణాళిక చేసుకున్నారని, కనీసం మూడేళ్ల గడువు ఇవ్వడం అవసరమని వారు సూచిస్తున్నారు. రద్దు చేయకపోయినా, పాత పన్ను విధానానికి ముగింపు సంకేతం ఇచ్చే అవకాశం ఉందని కొంత మంది అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఇవన్నీ ఊహాగానాలే. నిజంగా కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!