FDC: 16 రకాల మందులపై కేంద్రం బ్యాన్.. వెంటనే తయారీ, విక్రయాలు నిలిపివేత!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర వైద్యారోగ్యశాఖ 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాలను నిషేధించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను నిర్ణీత మోతాదులో కలిపి తయారు చేసే ఈ మందుల వినియోగం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణుల కమిటీ తేల్చడంతో వాటి తయారీ, పంపిణీ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు శాస్త్రీయంగా ధ్రువీకరించబడిన ఔషధాలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థలు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
ప్రజారోగ్యానికి హాని కలిగించే అవకాశం
అదేవిధంగా ఔషధాల తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు ఇతర భాగస్వాములు కూడా ఈ నిర్ణయానికి అనుగుణంగా తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై చేపట్టిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. చికిత్సలో సమర్థవంతంగా పనిచేయని, ప్రజారోగ్యానికి హాని కలిగించే అవకాశమున్న మందులను గుర్తించేందుకు ఔషధ సాంకేతిక సలహా మండలి (డీటీఏబీ) నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 16 రకాల ఎఫ్‌డీసీ ఔషధాలను నిషేధించినట్లు ప్రభుత్వం తెలిపింది.
వివరాలు
నిషేధిత జాబితాలో చాలా రకాల మందులు
నిషేధిత జాబితాలో చర్మ సంబంధిత వ్యాధులు, కండరాల సమస్యలు, నొప్పి నివారణ చికిత్సలు, యాంటీబయాటిక్ ఆధారిత మిశ్రమాలు సహా వివిధ వైద్య విభాగాలకు చెందిన ఔషధాలు ఉన్నాయి. అలాగే కలబంద (అలోవెరా), విటమిన్-ఈ, జోజోబా ఆయిల్, నారింజ నూనె, గోధుమ మొలకల నూనె, టీ ట్రీ ఆయిల్, అలాంటోనిన్, పాంథనోల్ వంటి పదార్థాలను కలిపి తయారు చేసే పలు చర్మ సంరక్షణ, చర్మ వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల తయారీని కూడా నిలిపివేయాలని స్పష్టం చేసింది.