Elon Musk-Jeff Bezos: బెజోస్ 'ప్రొమెతియస్' ప్రకటనకు మస్క్ నుంచి 'కాపీక్యాట్' సెటైర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, మరో బిలియనీర్ జెఫ్ బెజోస్‌పై విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అసలు ఏం జరిగిందంటే..? అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తాజాగా 'ప్రాజెక్ట్ ప్రొమెతియస్' పేరుతో కొత్త ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను తీసుకురావబోతున్నట్టు ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్‌కు తానే కో-సీఈఓగా బాధ్యతలు చేపడతానని కూడా చెప్పారు. కంప్యూటింగ్ నుంచి ఏరోస్పేస్, ఆటోమొబైల్ రంగాల వరకూ విస్తరించే ఏఐ ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలనేది ఆయన లక్ష్యం. ఈ ప్రకటన బయటకు రావగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వెంటనే ప్రతిస్పందించాడు. అసలు అలా జరగదని (Haha no way) పోస్టు పెట్టిన ఆయన.. కాపీక్యాట్ అని ఎద్దేవా చేశారు.
వివరాలు
స్పేస్‌ఎక్స్, టెస్లాలకు ప్రత్యక్ష పోటి
ఇది మొదటిసారి కాదు. గతంలో ఇంటర్నెట్ కోసం శాటిలైట్ నెట్‌వర్క్ నిర్మాణం గురించి, అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సంస్థ జూక్స్‌ను అమెజాన్ కొనుగోలు చేసిన సందర్భంలో కూడా మస్క్ ఇదే 'కాపీక్యాట్' అనే మాటను ఉపయోగించాడు. ఆ ప్రాజెక్టులు తన స్పేస్‌ఎక్స్, టెస్లాలకు ప్రత్యక్ష పోటిగా ఉండొచ్చని భావించి అప్పుడే విమర్శలు గుప్పించాడు.
వివరాలు
ఈ భారీ ప్రాజెక్ట్‌కు గూగుల్ మాజీ శాస్త్రవేత్త విక్ బజాజ్ నాయకత్వం
అంతరిక్ష పరిశోధన,శాటిలైట్ ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు..ఎక్కడ చూసినా ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ. ఇప్పటికే మస్క్‌కు చెందిన xAI సంస్థ గ్రోక్ మోడల్‌ను విడుదల చేసి ఓపెన్‌ఏఐ,గూగుల్‌లకు పోటీగా రంగంలోకి దిగింది. బెజోస్ ప్రవేశపెట్టబోతున్న ప్రాజెక్ట్ ప్రొమెతియస్ ఆ పోటీనీ మరింత పెంచనుందనే మాట ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు గూగుల్ మాజీ శాస్త్రవేత్త విక్ బజాజ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏఐ వేదిక కోసం ఇప్పటికి 6.2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ప్రారంభ దశలోనే ఇంత భారీ పెట్టుబడి పొందిన స్టార్టప్ ఇదేనని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఓపెన్‌ఏఐ, డీప్‌మైండ్, మెటా వంటి సంస్థల్లో పనిచేసిన పలువురు నిపుణులు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.