Dinesh Khara: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ రేసులో మాజీ ఎస్‌బీఐ చీఫ్ దినేశ్ ఖరా
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ పదవికి మాజీ ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖరా పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సశిధర్ జగదీశన్ స్థానంలో ఆయనను నియమించే అవకాశాలపై బ్యాంక్ బోర్డు పరిశీలిస్తున్నట్లు సీఎన్‌బీసీ-టీవీ18 తెలిపింది. ఖరా గతంలో ఎస్‌బీఐ ఛైర్మన్‌గా పనిచేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ పదవి కోసం గతంలో ఆయనను సంప్రదించినప్పటికీ.. ఆ ఆఫర్‌ను ఖరా తిరస్కరించారు. మార్చిలో అతను చక్రవర్తి రాజీనామా చేసిన తర్వాత ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాజీవ్ కుమార్‌ను బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమించారు. తాజాగా తన పేరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ పదవికి పరిశీలిస్తున్నారన్న వార్తలపై దినేశ్ ఖరా స్పందించారు.
వివరాలు
సీఈఓ ఎంపికకు అంతర్గత, బాహ్య అభ్యర్థుల పరిశీలన
దీని గురించి నాకు తెలియదు. దీనిపై వ్యాఖ్యానించేందుకు ఏమీ లేదు'' అని ఖరా సీఎన్‌బీసీ-టీవీ18తో అన్నారు.
సశిధర్ జగదీశన్ ఎండీ, సీఈఓగా మరోసారి నియామకం కోరుకోవడం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇటీవల ప్రకటించింది.
ఆయన పదవీకాలం అక్టోబర్ 26తో ముగియనుంది. దీంతో తదుపరి సీఈఓ ఎంపికపై బ్యాంక్ కసరత్తు చేస్తోంది.
ఈ పదవికి అంతర్గతంగా ఉన్నవారితో పాటు బయట నుంచి కూడా అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరూచా కూడా అంతర్గత అభ్యర్థుల్లో ఉన్నారు.
అయితే 2029లో బ్యాంక్ బోర్డులో పూర్తికాల డైరెక్టర్‌గా ఆయన పదవీకాలం ముగియనుండటం.. ఆయన అభ్యర్థిత్వానికి కొంత పరిమితిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాయకత్వ మార్పుపై విశ్లేషకుల అభిప్రాయాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాయకత్వ మార్పుపై మార్కెట్ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్టాక్‌పై పెట్టుబడిదారుల నమ్మకం ప్రస్తుతం బలహీనంగా ఉన్న నేపథ్యంలో సీఈఓ వారసుడి ఎంపిక విషయంలో కొంత అనిశ్చితి ఉండొచ్చని మాక్వైరీ, బెర్న్‌స్టీన్ సంస్థలు హెచ్చరించాయి.
అయితే సరైన వారసుడిని ఎంపిక చేస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు విలువపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని నోమురా అభిప్రాయపడింది.
మరోవైపు, బ్యాంక్ ప్రస్తుత షేరు విలువలోనే భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సవాళ్లు ఇప్పటికే ప్రతిబింబిస్తున్నాయని జేపీ మోర్గాన్ పేర్కొంది.
అందువల్ల షేరు విలువ మరింత తగ్గే అవకాశం పరిమితంగానే ఉండొచ్చని తెలిపింది.