Loading...
Roger Federer: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రోజర్‌ ఫెదరర్
హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రోజర్‌ ఫెదరర్

Roger Federer: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రోజర్‌ ఫెదరర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తన కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలను అందుకున్న ఈ స్విస్‌ స్టార్‌.. తాజాగా అంతర్జాతీయ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్నాడు. అమెరికాలోని న్యూపోర్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ఫెదరర్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ట్రోఫీని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఫెదరర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ''ఇప్పుడు కన్నీళ్లను దాచుకోవడానికి సన్‌గ్లాసెస్‌ కావాలి. నేను సాగించిన ప్రయాణం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇలాంటి వేదికపై మిమ్మల్ని మీరు చూసుకోవడం గొప్ప అనుభూతిగా ఉంటుంది. టెన్నిసే నా ప్రపంచం. ఈ ఆట చరిత్రలో భాగం కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఫెదరర్‌ చెప్పాడు.

వివరాలు

20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు

తన కెరీర్‌లో ఎంతో అండగా నిలిచిన జీవిత భాగస్వామి మిర్కా, కోచ్‌ సెవెరిన్‌తో పాటు తాను ఆరాధించే ఆటగాడు స్టెఫాన్‌ ఎడ్‌బర్గ్‌ను ఈ సందర్భంగా ఫెదరర్‌ గుర్తు చేసుకున్నాడు. వారిని తలుచుకుంటూ అతడు కన్నీటి పర్యంతమయ్యాడు.

రోజర్‌ ఫెదరర్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఒక దశలో వరుసగా 237 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగాడు.

ప్రతి టెన్నిస్‌ ఆటగాడు కలలు కనే వింబుల్డన్‌ టైటిల్‌ను అతడు ఏకంగా ఎనిమిదిసార్లు సొంతం చేసుకున్నాడు. దీంతో 'కింగ్‌ ఆఫ్‌ గ్రాస్‌'గా ప్రత్యేక గుర్తింపు పొందాడు.

వివరాలు

ఆరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు

అంతేకాకుండా ఆరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు, ఐదు యుఎస్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ఒకసారి ఛాంపియన్‌గా నిలిచాడు.

45 ఏళ్ల ఫెదరర్‌ 2022లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు.

ఫెదరర్‌తో పాటు అమెరికా మాజీ క్రీడాకారిణి మేరీ కారిలో కూడా అంతర్జాతీయ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది.

ADVERTISEMENT