Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల తర్వాత అందుబాటులోకి అంబర్‌పేట-మూసారాంబాగ్ వంతెన
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరవాసులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అంబర్‌పేట-మూసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన వంతెన సోమవారం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వంతెనను ప్రారంభించనున్నారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్ (ఎంసీహెచ్) మైదానంలో సీఎం బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా చివరకు వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే అంబర్‌పేట, మూసారాంబాగ్ మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ముఖ్యంగా చాదర్‌ఘాట్ వంతెనపై వాహనాల రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈ మార్గంలో తరచూ ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులకు ఉపశమనం లభించనుంది.
వివరాలు
మూడేళ్ల సమయం
మూసీ నదికి ఇరువైపులా వంతెన నిర్మాణానికి అవసరమైన స్థలం కల్పించేందుకు కట్టడాలను తొలగించి రహదారిని విస్తరించాల్సి వచ్చింది.
ఒకవైపు అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా, మరోవైపు మూసారాంబాగ్ ప్రాంతంలో రహదారి విస్తరణ చేపట్టాల్సి వచ్చింది.
అయితే భూసేకరణ, కట్టడాల తొలగింపు విషయంలో స్థానికులు ముందుకు రాకపోవడం, పరిహారం చెల్లింపు వంటి అంశాలు పనుల వేగాన్ని ప్రభావితం చేశాయి.
దీంతో వంతెన నిర్మాణానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టింది. వివిధ సమస్యలను అధిగమిస్తూ దాదాపు మూడేళ్ల తర్వాత పనులు పూర్తయ్యాయి.