Loading...
Andhra Pradesh: 25 భారీ పారిశ్రామిక పార్కులు.. 20,000 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు
25 భారీ పారిశ్రామిక పార్కులు.. 20,000 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు

Andhra Pradesh: 25 భారీ పారిశ్రామిక పార్కులు.. 20,000 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది. ఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందే నిధులను వినియోగించుకోవాలని భావిస్తోంది. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) కింద 22 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటికి అదనంగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న భారీ ప్రాజెక్టులకు అనుసంధానంగా శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో మరో మూడు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. భవ్య పథకం కింద ప్రతిపాదించిన పార్కుల కోసం ఏపీఐఐసీ ఇప్పటికే 12,000 ఎకరాల భూమిని సేకరించింది.

వివరాలు

ఎకరాకు రూ.కోటి కేంద్ర గ్రాంటు

మరో మూడు పార్కుల ఏర్పాటుకు అవసరమైన 8,000 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) కింద దేశవ్యాప్తంగా రూ.33,660 కోట్లతో 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇందులో భాగంగా తొలిదశలో 20 పార్కుల అభివృద్ధికి కేంద్రం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రం నుంచి ఆరు పార్కుల కోసం ఏపీఐఐసీ ప్రతిపాదనలు పంపింది.

వీటిలో రెండు పార్కులకు కేంద్రం ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండో దశలో 80 పార్కుల అభివృద్ధికి కేంద్రం దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ దశలో 16 ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

వివరాలు

ఇప్పటికే 12వేల ఎకరాల భూమి సేకరణ

భవ్య పథకం కింద పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎకరాకు రూ.కోటి చొప్పున కేంద్రం గ్రాంటు అందిస్తుంది.

మొత్తం 22 పార్కులకు కలిపి సుమారు 12 వేల ఎకరాల భూమిని ఏపీఐఐసీ ఇప్పటికే సేకరించింది.

ఈ పథకం కింద పార్కుల అభివృద్ధికి అవసరమైన భూముల్లో 90 శాతం సేకరించి ఉండాలనే నిబంధనను కేంద్రం విధించింది.

దీంతో భూములు అందుబాటులో ఉన్న ప్రాంతాలనే అధికారులు ప్రతిపాదనల్లో చేర్చారు.

కేంద్రం భవ్య పథకం కింద అనుమతించే పార్కులతో పాటు, మిగిలిన పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసీ సొంత నిధులతో అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

8,000 ఎకరాల్లో మరో మూడు పార్కులు

రాష్ట్రంలో ఏర్పాటు కానున్న భారీ ప్రాజెక్టులకు అనుసంధానంగా మరో మూడు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసీ ప్రతిపాదనలు రూపొందించింది.

కొత్త పరిశ్రమల రాకతో ఏర్పడే ఎకోసిస్టమ్‌ను వినియోగించుకుని, వాటికి అనుబంధంగా ఏర్పాటయ్యే సంస్థలకు అవసరమైన భూములను కేటాయించేందుకు వీలుగా ఈ పార్కులను ప్రతిపాదించింది.

ఈ మూడు పార్కుల ద్వారా మరో 8,000 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు అందుబాటులోకి తీసుకురావాలని ఏపీఐఐసీ లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT

వివరాలు

మూలపేటలో 2,000 ఎకరాల్లో కెమికల్ పార్కు

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో కెమికల్ పార్కును అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది.

భవ్య రసాయన పథకం కింద దేశవ్యాప్తంగా కెమికల్ పార్కుల అభివృద్ధికి కేంద్రం రూ.3,030 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది.

ఈ పథకం కింద మూలపేట కెమికల్ పార్కు అభివృద్ధికి కూడా ఏపీఐఐసీ ప్రతిపాదనలు పంపింది.

ఈ పార్కులో 450 ఎకరాల్లో రూ.2,250 కోట్ల పెట్టుబడులతో ఫాస్పారిక్ యాసిడ్, ఫెర్టిలైజర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ప్రభుత్వం భూమిని కేటాయించింది.

వివరాలు

పుట్టపర్తి వద్ద 5,000 ఎకరాల్లో కొత్త పార్కు

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో రూ.15,803 కోట్లతో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తోంది.

ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా మరిన్ని సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో వాటికి అవసరమైన భూమిని అందుబాటులో ఉంచేందుకు ఇక్కడ మరో 5,000 ఎకరాల్లో కొత్త పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడానికి భూసేకరణ చేపడుతోంది.

వివరాలు

అనకాపల్లిలో 1,000 ఎకరాల్లో రేర్ ఎర్త్ మినరల్ పార్కు

అనకాపల్లి జిల్లాలో 1,000 ఎకరాల విస్తీర్ణంలో రేర్ ఎర్త్ మినరల్ పార్కును అభివృద్ధి చేయనున్నారు.

ఏటా 25,000 టన్నుల రేర్ ఎర్త్ మినరల్స్‌ను ఉత్పత్తి చేసి, శుద్ధి చేయడం ఈ పార్కు లక్ష్యం.

ఈ ప్రాజెక్టుకు అనుగుణంగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భూమిని అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త పార్కు అభివృద్ధిపై ఏపీఐఐసీ దృష్టి సారించింది.

ఈ వివరాలను ఏపీఐఐసీ వీసీ, ఎండీ దినేష్‌కుమార్ తెలిపారు.

ADVERTISEMENT