Norway: నార్వే రాజు హరాల్డ్ ఇకలేరు.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
నార్వే రాజు ఐదవ హరాల్డ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. దేశ రాజధాని ఓస్లోలోని జాతీయ ఆస్పత్రిలో ఉదయం 6.35 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు రాజభవనం వర్గాలు వెల్లడించాయి. నార్వేలో రాచరిక వ్యవస్థను ఆధునీకరించిన రాజుగా హరాల్డ్ ఖ్యాతి గడించారు. వృద్ధాప్యం, దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆయన సింహాసనాన్ని వీడలేదు. హరాల్డ్ మరణంతో పట్టపు రాకుమారుడిగా ఉన్న 53 ఏళ్ల హాకోన్‌ను రాజుగా ప్రకటించారు. ఇకపై ఆయన ఎనిమిదో హాకోన్ రాజుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హాకోన్ పెద్ద కుమార్తె ఇన్‌గ్రిడ్ అలెగ్జాండ్రా నార్వేకు పట్టపు రాకుమారిగా వ్యవహరించనున్నారు. హాకోన్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం ఆమెకే లభిస్తుంది.
వివరాలు
మోదీ సంతాపం
నార్వేలో రాజుకు కేవలం లాంఛనప్రాయమైన అధికారాలే ఉంటాయి. దేశంలో అసలు అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటు చేతుల్లో ఉంటుంది.
నార్వే రాజు ఐదవ హరాల్డ్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. హరాల్డ్ చూపిన ఆత్మీయత తన అంతరంగాన్ని తాకిందని ప్రధాని పేర్కొన్నారు.
నార్వేకు ఆయన అందించిన సేవలు మరువలేనివని మోదీ కొనియాడారు.