Loading...
Amaravati: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాజెక్ట్ 'అమానహ్'.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాజెక్ట్ 'అమానహ్'.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Amaravati: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాజెక్ట్ 'అమానహ్'.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను ఆక్రమణదారుల చెర నుంచి కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ ఆస్తులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా 'ప్రాజెక్ట్ అమానహ్' (బాధ్యత)ను అమల్లోకి తీసుకురానుంది. సోమవారం నుంచి ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలో మొత్తం 12,855 ఆస్తులు ఉన్నాయి. ఇందులో ప్రతి జిల్లా పరిధిలో ఐదు వక్ఫ్ ఆస్తుల చొప్పున డిజిటలైజ్ చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు ఏడు రోజులపాటు కొనసాగుతుంది. అనంతరం క్షేత్రస్థాయిలో రూపొందే నివేదిక ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత మిగిలిన వక్ఫ్ ఆస్తులకు కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

వివరాలు

వక్ఫ్ ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు

ప్రాజెక్ట్ అమానహ్ నిర్వహణ బాధ్యతలను వక్ఫ్ ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. వక్ఫ్ ఇన్‌స్పెక్టర్లు లేని జిల్లాల్లో వారి కంటే కింది స్థాయి అధికారి ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.

వక్ఫ్ ఇన్‌స్పెక్టర్లు తమ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి వక్ఫ్ ఆస్తి వద్దకు స్వయంగా వెళ్లి, దాని వాస్తవ పరిస్థితిని నమోదు చేయాలి.

ఆస్తికి సంబంధించిన సర్వే నంబర్, విస్తీర్ణం, భౌతిక స్థితికి సంబంధించిన ఫొటోలను సేకరించాలి. అనంతరం సేకరించిన వివరాలను సర్వే కమిషన్ ఆఫ్ వక్ఫ్ నివేదికతో పోల్చి చూడాలి.

క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వివరాలను నమోదు చేయాలి.

వివరాలు

ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్ లైన్ లో

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి వక్ఫ్ ఆస్తికి ప్రత్యేక ఐడీని కేటాయిస్తారు. ఆ ప్రత్యేక ఐడీ నంబర్ ఆధారంగా ఆ వక్ఫ్ ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.

తద్వారా రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచడంతో పాటు, వాటి వాస్తవ స్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు అవకాశం కలుగుతుంది.

ADVERTISEMENT