Kurnool: ఇక విమానాలను నడిపే పాఠాలు.. కర్నూలులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోనే మొట్టమొదటి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మైసూరుకు చెందిన 'ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ'కి కర్నూలు విమానాశ్రయంలో 1.25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు అకాడమీ ఓ భవనాన్ని నిర్మించింది. దాని పక్కనే అధునాతన 'హ్యాంగర్' భవనాన్ని కూడా సిద్ధం చేసింది. ఇందులో ఒకేసారి నాలుగు వరకు శిక్షణ విమానాలను నిలిపి ఉంచే సదుపాయం ఉంది. హ్యాంగర్‌లోనే చిన్నపాటి ఎం.ఆర్.ఒ. (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ విమానాలకు అవసరమైన మరమ్మతులు, సర్వీసింగ్ పనులను ఇక్కడే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు.
వివరాలు
శిక్షణ విమానాలతో ట్రయల్ రన్ విజయవంతం
విమానాశ్రయ రన్‌వే నుంచి శిక్షణ కేంద్రం వరకు శిక్షణ విమానాలు రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకంగా టాక్సీవేను కూడా సిద్ధం చేశారు.
విద్యార్థులకు శిక్షణ అందించేందుకు అధునాతన సిమ్యులేటర్లను ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన 'హిందుస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్'లో 'ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ' ఒక భాగంగా ఉంది. ఈ సంస్థ మైసూరులో గత 12 ఏళ్లుగా పైలట్లకు శిక్షణ అందిస్తోంది.
ఇప్పుడు రెండో శిక్షణ కేంద్రాన్ని కర్నూలులో ప్రారంభించబోతోంది. అకాడమీ వద్ద సెస్నా, టెక్నామ్ బ్రాండ్లకు చెందిన సింగిల్ ఇంజిన్, మల్టీ ఇంజిన్ శిక్షణ విమానాలు ఉన్నాయి.
మైసూరులో ఉన్న శిక్షణ విమానాల్లో మూడింటిని ఇకపై కర్నూలు విమానాశ్రయంలోనే ఉంచాలని సంస్థ భావిస్తోంది.
వివరాలు
కర్నూలులో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు
ఇందుకోసం ఇప్పటికే శిక్షణ విమానాలను కర్నూలుకు తీసుకువచ్చి ఉంచేందుకు, అలాగే విమానాలను నడపడంపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ ట్రయల్ రన్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో కర్నూలులో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యార్థులకు శిక్షణ అందించేలా కర్నూలు విమానాశ్రయంలోని అకాడమీలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏవియేషన్ అకాడమీ వర్గాలు తెలిపాయి.
వివరాలు
కర్నూలులోనే బోధన
ప్రస్తుతం పైలట్ శిక్షణలో భాగంగా తరగతి గది బోధన కర్నూలులోనే జరుగుతోంది.
అయితే విమానాలు నడిపే ప్రాక్టికల్ శిక్షణ కోసం విద్యార్థులను మైసూరుకు పంపిస్తున్నారు.కర్నూలు అకాడమీ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ప్రాక్టికల్ శిక్షణను కూడా ఇక్కడే అందించనున్నారు.
భవిష్యత్తులో గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ, ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను కూడా కర్నూలు కేంద్రంలో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.