LOADING...
Banking Rules: తరచూ ఉద్యోగ మార్పులు.. పర్సనల్ లోన్‌పై ప్రభావం ఎంత..? బ్యాంకుల రూల్స్ ఇవే!
తరచూ ఉద్యోగ మార్పులు.. పర్సనల్ లోన్‌పై ప్రభావం ఎంత..? బ్యాంకుల రూల్స్ ఇవే!

Banking Rules: తరచూ ఉద్యోగ మార్పులు.. పర్సనల్ లోన్‌పై ప్రభావం ఎంత..? బ్యాంకుల రూల్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అత్యవసర పరిస్థితుల్లో చాలా మంది పర్సనల్ లోన్‌లపై ఆధారపడుతున్నారు. ఇటీవలి కాలంలో 'ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్' సౌకర్యం అందుబాటులోకి రావడంతో నిమిషాల వ్యవధిలోనే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు రుణాలను ఆమోదిస్తున్నాయి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసిన వెంటనే లోన్ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నాయి. అయితే రుణం పొందడంలో సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 750కు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపవు. ఒకవేళ ఇచ్చినా అధిక వడ్డీ రేట్లు విధించే అవకాశముంది. అంతేకాకుండా, క్రెడిట్ హిస్టరీ కూడా చాలా ముఖ్యం. మీరు గతంలో తీసుకున్న రుణాలను సమయానికి చెల్లించారా లేదా అనే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి.

వివరాలు

ఉద్యోగం మార్పు ప్రభావం

ఇటీవల ఎక్కువ జీతం, మెరుగైన అవకాశాల కోసం చాలామంది తరచుగా ఉద్యోగాలు మారుతున్నారు. అయితే బ్యాంకులు ఇప్పుడు ఉద్యోగ స్థిరత్వాన్ని కూడా ముఖ్య ప్రమాణంగా పరిగణిస్తున్నాయి. ఒకే సంస్థలో స్థిరంగా పనిచేసేవారికి రుణాలు త్వరగా మంజూరు అవుతాయి. తరచుగా ఉద్యోగం మారితే లోన్ ఆమోద ప్రక్రియ ఆలస్యం కావచ్చు. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు బ్యాంకులు దాన్ని "సెటిలింగ్ పీరియడ్"గా భావిస్తాయి. ఈ సమయంలో రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపవు. అదేవిధంగా, మీరు పనిచేస్తున్న రంగంలో ఉద్యోగ మార్పుల రేటు ఎక్కువగా ఉంటే కూడా బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. స్టార్టప్ కంపెనీల్లో పనిచేసేవారికి లోన్లు త్వరగా మంజూరు కావడం కష్టం. కానీ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసేవారికి రుణాలు సులభంగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వివరాలు

ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటే

ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులకు సాధారణంగా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఈ దశను అనిశ్చితి కాలంగా పరిగణించి, దరఖాస్తులను తిరస్కరించే అవకాశముంది. అలాగే కాంట్రాక్ట్ లేదా ఫ్రీలాన్స్ ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా లోన్లు పొందడం కష్టమే. ఒకే సంస్థలో ఎక్కువకాలం పనిచేయడం, జీతం క్రమంగా పెరుగుతూ ఉండటం వంటి అంశాలు రుణం పొందడంలో అనుకూలంగా ఉంటాయి. కొత్త ఉద్యోగంలో చేరిన వెంటనే లోన్ కోసం దరఖాస్తు చేయకుండా, కనీసం ఆరు నెలలు వేచి ఉండటం మంచిది. అలాగే సిబిల్ స్కోర్ మరియు క్రెడిట్ హిస్టరీని ముందుగా పరిశీలించుకోవాలి. దరఖాస్తు తిరస్కరణకు గురైనా లేదా ఒకేసారి అనేక బ్యాంకుల్లో లోన్ కోసం అప్లై చేసినా, అది సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Advertisement