Hindustan Copper OFS Oversubscribed: హిందుస్థాన్ కాపర్‌లో కేంద్రం వాటా విక్రయం.. తొలిరోజే 3.41 రెట్లు సబ్‌స్క్రిప్షన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా హిందుస్థాన్ కాపర్‌లో ఆఫర్ ఫర్ సేల్ (OFS) చేపట్టింది. ఆగస్ట్ 25న ప్రారంభమైన ఈ ఓఎఫ్‌ఎస్‌కు తొలిరోజే అనూహ్య స్పందన వచ్చింది. దీంతో తొలుత నిర్ణయించిన 3 శాతం వాటాకు అదనంగా మరో 3 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ వస్తే వినియోగించేందుకు ఉంచిన గ్రీన్ షూ ఆప్షన్‌ను తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హిందుస్థాన్ కాపర్‌లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 6 శాతం వాటాను విక్రయించనుంది. తొలిరోజైన ఆగస్ట్ 25న నాన్-రిటైల్, సంస్థాగత మదుపరుల కోసం ఓఎఫ్‌ఎస్‌ను అందుబాటులో ఉంచారు. రెండో రోజైన ఆగస్ట్ 26న రిటైల్ ఇన్వెస్టర్లు కూడా బిడ్లు వేసేందుకు అవకాశం కల్పించారు.
వివరాలు
రిటైల్ మదుపరుల కోసం దాదాపు 10 శాతం వాటా
రిటైల్ మదుపరుల కోసం దాదాపు 10 శాతం వాటాను కేటాయించారు.
గ్రీన్ షూ ఆప్షన్ అమలు చేయడంతో నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా మరోసారి బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లభించింది.
ఆగస్ట్ 25న హిందుస్థాన్ కాపర్ షేర్లను రూ.514 ఫ్లోర్ ప్రైస్‌కు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.
అంతకుముందు రోజు ముగింపు ధరతో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం తక్కువ.
తొలిరోజు సంస్థాగత మదుపరుల కోసం 2.61 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా.. ఏకంగా 3.41 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది.
మొత్తం 8.91 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. వీటి విలువ సుమారు రూ.4,600 కోట్లుగా ఉంది.
దీంతో ఈ షేర్లను దక్కించుకునేందుకు ఇన్వెస్టర్ల నుంచి భారీ పోటీ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
కంపెనీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 25 వేల షేర్లు
తొలుత నిర్ణయించిన 3 శాతం వాటాకు సమానంగా ఉన్న షేర్లతో పాటు..ఇప్పుడు మరో 3 శాతం వాటాకు సమానమైన 2,90,10,721 ఈక్విటీ షేర్లను గ్రీన్ షూ ఆప్షన్ కింద అందుబాటులోకి తీసుకొచ్చారు.
మొత్తం 5.80 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3,000 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆగస్ట్ 26న రిటైల్ ఇన్వెస్టర్లు కూడా రూ.514 ఫ్లోర్ ప్రైస్‌కు హిందుస్థాన్ కాపర్ షేర్ల కోసం బిడ్లు వేయొచ్చు.
కంపెనీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 25 వేల షేర్లను కేటాయించారు.
ప్రస్తుతం హిందుస్థాన్ కాపర్‌లో కేంద్ర ప్రభుత్వానికి 66.14 శాతం వాటా ఉంది. ఓఎఫ్‌ఎస్ ద్వారా 6 శాతం వాటా విక్రయిస్తే.. ప్రభుత్వ వాటా 60.14 శాతానికి తగ్గనుంది.
వివరాలు
హిందుస్థాన్ కాపర్ షేరు పరిస్థితి ఎలా ఉంది?
సాధారణంగా ఆఫర్ ఫర్ సేల్ సమయంలో వరుసగా రెండు రోజుల పాటు సంబంధిత కంపెనీ షేర్లపై ఒత్తిడి కనిపిస్తుంటుంది.
అయితే హిందుస్థాన్ కాపర్ విషయంలో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది.
ఆగస్ట్ 25న దాదాపు 10 శాతం డిస్కౌంట్‌తో ఓఎఫ్‌ఎస్ ప్రారంభించినప్పటికీ.. షేరు ధర సుమారు 5-6 శాతం వరకు పడిపోయింది.
అయితే ఆగస్ట్ 26న కూడా ఓఎఫ్‌ఎస్ కొనసాగుతున్నప్పటికీ షేరు ధర పుంజుకోవడం గమనార్హం.
వార్త రాసే సమయానికి హిందుస్థాన్ కాపర్ షేరు సుమారు 2.50 శాతం లాభంతో రూ.546 స్థాయిలో ట్రేడవుతోంది.
కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.52.69 వేల కోట్లుగా ఉంది.