I Squared-Veolia: రీ సస్టైనబిలిటీ కొనుగోలుకు ఐ స్క్వేర్డ్-వియోలియా పోటీ.. రూ.11 వేల కోట్ల బిడ్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ కేంద్రంగా వ్యర్థాల నిర్వహణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీ సస్టైనబిలిటీ సంస్థను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్,ఫ్రాన్స్‌కు చెందిన వియోలియా కలిసి పోటీ పడుతున్నాయి. ఈ రెండు సంస్థల కన్సార్షియం రీ సస్టైనబిలిటీ విలువను సుమారు రూ.10,000 కోట్ల నుంచి రూ.11,000 కోట్ల మధ్యగా అంచనా వేసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రాథమిక బిడ్లు సమర్పించినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అయితే రీ సస్టైనబిలిటీలో 60 శాతం వాటాను కలిగి ఉన్న కేకేఆర్ మాత్రం సంస్థకు మరింత అధిక విలువ వస్తుందని ఆశిస్తోంది. కనీసం రూ.14,000 కోట్ల నుంచి రూ.16,000 కోట్ల వరకు విలువ లభిస్తేనే విక్రయాన్ని పరిగణించాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
100కు పైగా ప్రాంతాల్లో సంస్థ సేవలు.. 22,000 మంది ఉద్యోగులు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించనున్న నిర్వహణ లాభానికి 13 నుంచి 15 రెట్లు అధిక విలువ లభించినప్పుడే వాటా విక్రయానికి ముందుకు వెళ్లాలని కేకేఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఐ స్క్వేర్డ్-వియోలియా కన్సార్షియం నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా కేకేఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సంస్థకు సరైన విలువ దక్కేలా వివిధ అవకాశాలను అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
రీ సస్టైనబిలిటీ భారత్‌తో పాటు సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా తదితర దేశాలు, ప్రాంతాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
మొత్తంగా 100కు పైగా ప్రాంతాల్లో సంస్థ తన సేవలను అందిస్తోంది. రీ సస్టైనబిలిటీలో దాదాపు 22,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వివరాలు
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,700 కోట్ల ఆదాయం
2025-26 ఆర్థిక సంవత్సరంలో రీ సస్టైనబిలిటీ సుమారు రూ.2,700 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
అదే సమయంలో రూ.930 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని రూ.3,400 కోట్లకు, నిర్వహణ లాభాన్ని రూ.1,100 కోట్లకు పెంచుకోవచ్చని సంస్థ అంచనా వేస్తోంది.
ఈ వృద్ధి అంచనాలు సంస్థ విక్రయ విలువపై నిర్ణయం తీసుకోవడంలో కీలకంగా మారే అవకాశం ఉంది.