India market: 2023లో 25శాతం లాభాలతో అధరగొట్టిన భారత స్టాక్ మార్కెట్
2023వ సంవత్సరం భారత పెట్టుబడిదారులకు బాగా కలిసొచ్చింది. భారత స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది గణనీయంగా పెరుగుదలను నమోదు చేసింది. ఏకంగా 24.8శాతం లాభాలను భారత స్టాక్ మార్కెట్లు చవిచూశాయి. దీంతో 4.16 ట్రిలియన్ డాలర్లకు సంపద పెరిగింది. ఈ ఏడాది భారీగా లాభాలను ఆర్జించిన దేశాల జాబితాలో భారత్ ఐదోస్థానంలో నిలిచింది. బలమైన ఆర్థిక మూలాలు, విదేశీ, స్వదేశీ సంస్థల నుంచి వచ్చిన పెట్టుబడుల వల్ల భారతీయ స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం టాప్-10 ప్రపంచ మార్కెట్లలో చోటు దక్కించుకుంది.
అగ్రస్థానంలో అమెరికా షేర్ మార్కెట్
అమెరికా షేర్ మార్కెట్ 50.35 ట్రిలియన్ డాలర్లతో అగ్రగామిగాఉంది. 2023లో యూఎస్ షేర్ మార్కెట్ 22.61శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు, ఆర్థిక సంక్షోభం.. కరోనా సృష్టించిన అస్తిరత వల్ల చైనా మార్కెట్ క్యాపిటలైజేషన్ 8.81శాతం తగ్గింది. 10.57 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడోస్థానంలో ఉంది. జపాన్ మార్కెట్ క్యాప్ 11.6శాతం పెరిగి 6.09 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. హాంగ్ కాంగ్ మార్కెట్ దాదాపు 12.6శాతం క్షీణించి 4.56 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ఐరోపాలోని ఫ్రాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది 13.77శాతం పెరిగి 3.27 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే యూకే మార్కెట్ 5.3శాతం పెరిగి 3.07 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.