Kenya's Top Fuel Supplier: సౌదీ,యూఏఈని దాటిన భారత్.. కెన్యాకు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో నంబర్‌వన్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వాణిజ్య మార్గాలు దెబ్బతిన్న వేళ భారత్ కీలక పరిణామాన్ని నమోదు చేసింది. కెన్యాకు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానానికి చేరింది. భారత్ పెట్రోలియం అవసరాల కోసం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న దేశమే అయినప్పటికీ.. గత కొన్ని దశాబ్దాల్లో శుద్ధి సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంది. బెల్జియంకు చెందిన కమోడిటీ డేటా సంస్థ కేప్లర్ (Kpler) సమాచారాన్ని ఉటంకిస్తూ డల్లాస్‌కు చెందిన ఇంధన ఆర్థికవేత్త అనస్ అల్‌హజ్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. కెన్యాకు పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, ఫ్యూయల్ ఆయిల్ సరఫరాలో భారత్.. యూఏఈ, సౌదీ అరేబియాను అధిగమించిందని ఆయన తెలిపారు.
వివరాలు
ఆఫ్రికాకు భారత ఇంధన ఎగుమతుల్లో రికార్డు
కెన్యాకే కాకుండా ఆఫ్రికా దేశాలకు భారత పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా జూలైలో రికార్డు స్థాయికి చేరాయి.
గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 66శాతం పెరిగాయని అల్‌హజ్జీ తెలిపారు.
రష్యా ముడిచమురుతో ఇతర దేశాల్లో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో భారత ఇంధనాలకు ఆఫ్రికా ప్రధాన మార్కెట్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు.
దీంతో భారత ఇంధన సరుకులు యూరప్ నుంచి ఆఫ్రికా వైపు మళ్లుతున్నాయని తెలిపారు.
గతంలో సౌదీ అరామ్‌కో, అబుదాబికి చెందిన అడ్నాక్ (ADNOC), ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వ మద్దతుతో కుదిరిన ఒప్పందాల ద్వారా కెన్యా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాన్ని ఎక్కువగా పొందేది.
వివరాలు
ప్రపంచంలోనే అగ్రశ్రేణి చమురు శుద్ధి దేశాల్లో భారత్
అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులతో సరఫరా మార్గాలు దెబ్బతినడంతో కెన్యా భారత్ నుంచి ఇంధనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెట్రోలియం,సహజవాయువు మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద చమురు శుద్ధి దేశం.
ఆసియాలో రెండో స్థానంలో ఉంది. దేశంలో ప్రస్తుతం 22రిఫైనరీలు పనిచేస్తున్నాయి.
వీటి మొత్తం వార్షిక శుద్ధి సామర్థ్యం 258.1 మిలియన్ టన్నులుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 61.5 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
అదే సమయంలో దేశం అవసరమైన ముడిచమురులో 90శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి సముదాయం కూడా భారత్‌లోనే ఉంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ రిఫైనరీ సముదాయం ఉంది.
వివరాలు
కెన్యాకు యూఏఈ ఇంధన సరఫరా భారీగా తగ్గింది
భారత్ రిఫైనింగ్ సామర్థ్యం మరో ఆసక్తికరమైన పరిణామానికి దారితీసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ముడిచమురు ఎగుమతిదారుల్లో ఒకటైన రష్యా.. ఉక్రెయిన్ దాడులతో అక్కడి రిఫైనరీలు దెబ్బతినడంతో భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.
కెన్యాకు యూఏఈ నుంచి వెళ్లే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా గణనీయంగా తగ్గింది.
జనవరిలో రోజుకు సుమారు 90 వేల బ్యారెళ్లుగా ఉన్న యూఏఈ సరఫరా.. ఆగస్టులో దాదాపు 15 వేల బ్యారెళ్లకు పడిపోయినట్లు కెన్యాకు చెందిన వార్తా సంస్థ నివేదించింది.
భారత్ వైపు కెన్యా మొగ్గుకు సంబంధించిన ఆధారాలు కొన్ని నెలల ముందే కనిపించాయి.
వివరాలు
కెన్యాకు భారత్ ఎగుమతుల్లో 151 శాతం వృద్ధి
బిజినెస్ డైలీ ఆఫ్రికా పరిశీలించిన అధికారిక పత్రాల ప్రకారం.. భారత్‌లోని సిక్కా పోర్టులో లోడ్ చేసిన 8.238 కోట్ల లీటర్ల కిరోసిన్‌ను మార్చి 19న మొంబాసాలో దించారు.
అలాగే మరో 15.675 కోట్ల లీటర్ల ఇంధనాన్ని ఏప్రిల్‌లో సిక్కా నుంచి కెన్యాకు తరలించేందుకు షెడ్యూల్ చేశారు. ఇందులో 8.115 కోట్ల లీటర్ల కిరోసిన్, 7.56 కోట్ల లీటర్ల డీజిల్ ఉన్నాయి.
కెన్యాకు భారత పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం.. తూర్పు ఆఫ్రికా ప్రాంతంతో భారత్ వాణిజ్యం విస్తరిస్తున్న సమయంలోనే చోటుచేసుకుంది.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2026 జూలైలో కెన్యాకు భారత్ ఎగుమతుల విలువ 2025 జూలైతో పోలిస్తే 151.41 శాతం పెరిగింది.
వివరాలు
కెన్యాకు భారత్ ఎగుమతుల్లో 151 శాతం వృద్ధి
ఆ నెలలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన భారత ఎగుమతి గమ్యస్థానాల్లో కెన్యా మొదటి ఐదు దేశాల్లో చోటు దక్కించుకుంది.
అయితే ఈ 151.41 శాతం వృద్ధి కేవలం పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినది కాదు. అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతులను కలిపిన గణాంకమిది.
అయినప్పటికీ జూలైలో భారత మొత్తం ఎగుమతుల వృద్ధిలో పెట్రోలియం ఉత్పత్తులు కీలక పాత్ర పోషించాయి.
ప్రపంచవ్యాప్తంగా వీటి ఎగుమతులు 67.64 శాతం పెరిగి.. గత ఏడాది జూలైలోని 4.13 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది 6.92 బిలియన్ డాలర్లకు చేరాయి.
వివరాలు
ఆఫ్రికానే భారత ఇంధనానికి ప్రధాన మార్కెట్
భారత్ నుంచి ఆఫ్రికాకు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు జూలైలో రికార్డు స్థాయికి చేరాయని అల్‌హజ్జీ తెలిపారు.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 66శాతం పెరిగాయని పేర్కొన్నారు.
రష్యా ముడిచమురుతో తయారైన పెట్రోలియం ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో ఆఫ్రికా భారత ఇంధనానికి ప్రధాన గమ్యస్థానంగా మారిందని వివరించారు.
2025-26లో కెన్యా.. భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా నిలిచిందని నైరోబీలోని భారత హైకమిషన్ వెల్లడించింది.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 4.31బిలియన్ డాలర్లకు చేరింది.
ఇందులో భారత్ నుంచి కెన్యాకు 4.01బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉండగా.. కెన్యా నుంచి భారత్ 290మిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంది.
కెన్యాకు భారత్ ప్రధానంగా ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో పెట్రోలియంఉత్పత్తులే అగ్రస్థానంలో ఉన్నాయి.