Credit card: క్రెడిట్ కార్డు బిల్లు ఇక నుంచి ఎక్కువ చెల్లించలేరు
క్రెడిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై వినియోగదారులు నెలవారీగా జనరేట్ అయిన బిల్లుకంటే ఎక్కువ చెల్లించడానికి వీలు లేకుండా బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి. కొందరు వినియోగదారులు కావాలనే ఎక్కువ బిల్లు చెల్లిస్తుంటారు. దీని ద్వారా వచ్చే నెల ఇబ్బంది ఉండదని, క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం పడొద్దని ఎక్కువ చెల్లిస్తుంటారు. అయితే ఇక మీదట అలా చెల్లించడం కుదరదని చెప్పాలి. ఒక వేళ ఎక్కువ మొత్తం చెల్లించినా, బ్యాంకులు ఆ మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలో జమ చేస్తాయనే విషయాన్ని గమనించాలి.
క్రెడిట్ కార్డుల ద్వారా మనీలాండరింగ్
ఎక్కువ బిల్లు చెల్లింపులను బ్యాంకులు అంగీకరించకపోవడానికి మరో కారణం కూడా ఉంది. క్రెడిట్ కార్డుల ద్వారా మనీలాండరింగ్, మోసాలు జరుగుతున్నట్లు ప్రోవైడర్లు గుర్తించాయి. వాటిని నియంత్రించేందుకు బ్యాంకులు ఈ నిబంధనను తీసుకొచ్చాయి. ప్రధానంగా విదేశీ కొనుగోళ్లను ఈ నిబంధన పూర్తిస్థాయిలో నివారిస్తుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. ఖాతాల్లో కొట్టేసిన డబ్బును మోసగాళ్లు క్రెడిట్ కార్డులకు పంపుతున్నారని, ఆ తర్వాత అవి విదేశీ లావాదేవీలకు వినియోగిస్తున్నట్లు బ్యాంకులు తెలుసుకున్నాయి. దీని వల్లే బ్యాంకులు ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.