భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్
భారతదేశంలోని స్టార్ట్-అప్‌లకు ఆర్థిక సహాయం చేసేందుకు అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ & కో ప్లాన్ చేస్తోంది. అయితే అగ్రగామిగా ఉన్న స్టార్ట్-అప్‌లకు మాత్రమే ఆర్థికంగా చేయూతనివ్వాలని ఆ సంస్థ నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఖాతాదారులతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి జేపీ మోర్గాన్ బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేపీ మోర్గాన్ బ్యాంక్ గత నెలలో ముంబైలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా జేపీ మోర్గాన్ బ్యాంక్ మిడిల్ రేంజ్, పెద్ద కార్పొరేట్ క్లయింట్‌లపై మాత్రమే దృష్టి సారించింది.
తయారీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై ఫోకస్
తాము కేవలం బ్యాంకింగ్ లావాదేవీలపైనే దృష్టి సారించడం లేదని జేపీ మోర్గాన్ భారతదేశ సీనియర్ అధికారి కౌస్తుభ్ కులకర్ణి చెప్పారు. తాము ప్రపంచ మార్కెట్‌కు సంబంధించిన ఉత్పత్తులు, సేవలను ఎలా అందించగలమో అర్థం తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. జేపీ మోర్గాన్ ప్రత్యేకంగా భారతదేశం, విదేశాలలో పెద్ద వినియోగదారుల ధోరణిని కలిగి ఉన్న కంపెనీలకు మాత్రమే ఆర్థిక చేయూత అందించాలని చూస్తోంది. వ్యాపార సేవల అవుట్‌సోర్సింగ్, తయారీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో పదివేల బిలియన్ల డాలర్ల పెట్టుబడులను చూస్తాయని కౌస్తుభ్ కులకర్ణి చెప్పారు. ఆయా రంగాలే జేపీ మోర్గాన్ పెట్టుబడులకు ప్రధాన టార్గెట్‌గా ఆయన చెప్పుకొచ్చారు.