Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 24,300 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చే బలహీన సంకేతాలు, మదుపర్ల జాగ్రత్త వహించడాన్ని ప్రేరేపించాయి. దీనితో పాటు ఆటో మరియు బ్యాంకింగ్ రంగంలోని షేర్లలో అమ్మకాల ప్రేరణతో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్ల పైగా నష్టపోగా, నిఫ్టీ 24,300 పాయింట్ల కింద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 156 పాయింట్లు తగ్గి 80,542 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 41 పాయింట్లు కుంగి 24,294 వద్ద కొనసాగుతోంది. ఈ రోజు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నారు.
బంగారం ఔన్సు ధర 2,660.90 డాలర్లు
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ షేర్లు లాభాలతో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.21 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. బంగారం ఔన్సు ధర 2,660.90 డాలర్ల వద్ద కొనసాగుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.92 వద్ద ట్రేడవుతుంది.
మిశ్రమంగా ట్రేడవుతున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు
అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.11 శాతం, జపాన్ నిక్కీ 0.21 శాతం నష్టంతో ట్రేడవుతుండగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.67 శాతం, షాంఘై 0.64 శాతం లాభంతో కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తిరిగి విక్రయదారులుగా మారారు. మంగళవారం నికరంగా రూ.6410 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2706 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.