Loading...
Piyush Goyal: షార్క్‌ట్యాంక్‌ తరహాలో భారత్‌-జపాన్‌ స్టార్టప్‌ సిరీస్‌.. గోయల్‌ ప్రతిపాదన
షార్క్‌ట్యాంక్‌ తరహాలో భారత్‌-జపాన్‌ స్టార్టప్‌ సిరీస్‌.. గోయల్‌ ప్రతిపాదన

Piyush Goyal: షార్క్‌ట్యాంక్‌ తరహాలో భారత్‌-జపాన్‌ స్టార్టప్‌ సిరీస్‌.. గోయల్‌ ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-జపాన్‌ మధ్య స్టార్టప్‌ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ (Piyush Goyal)ఓ కొత్త ప్రతిపాదన చేశారు. 'షార్క్‌ట్యాంక్‌' తరహాలో భారత్‌-జపాన్‌ స్టార్టప్‌ సిరీస్‌ను నిర్వహించాలని సూచించారు. దీనివల్ల ఇరు దేశాల స్టార్టప్‌ వ్యవస్థాపకులు,పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడంతోపాటు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు. టోక్యోలో స్టార్టప్‌లపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జపాన్‌ రాజధాని టోక్యోలో స్టార్టప్‌ రంగానికి సంబంధించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం తాజాగా జరిగింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులతో మాట్లాడిన గోయల్‌.. 'షార్క్‌ట్యాంక్‌' తరహాలో వర్చువల్‌ సెషన్లు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. స్టార్టప్‌లను నిర్వహిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార ఆలోచనలు,ప్రాజెక్టులను పెట్టుబడిదారులకు వివరించేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు.

వివరాలు 

ఇరు దేశాల స్టార్టప్‌లకు ప్రయోజనం

ఇలాంటి సిరీస్‌ ద్వారా భారత్‌లోని స్టార్టప్‌ల కొత్త ఆలోచనలు, వ్యాపార నమూనాలను జపాన్‌ పెట్టుబడిదారులు తెలుసుకునే అవకాశం ఉంటుందని గోయల్‌ అన్నారు.

అదే సమయంలో జపాన్‌కు చెందిన స్టార్టప్‌లు భారత్‌లో తమకు అనుకూలమైన వ్యాపార భాగస్వాములను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

ఒక్క ఆలోచన.. బలమైన వాణిజ్య బంధానికి దారి

ఒక మంచి వ్యాపార ఆలోచన పెట్టుబడులు పొంది కార్యరూపం దాల్చినప్పుడు.. అది క్రమంగా భారత్‌, జపాన్‌ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలదని గోయల్‌ అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా భారత్‌లోని డీప్‌టెక్‌ కంపెనీలు, ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లలో జపాన్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.

వివరాలు 

షార్క్‌ట్యాంక్‌ అంటే..

'షార్క్‌ట్యాంక్‌' (Shark Tank) అనేది వ్యాపార రంగంలో కొత్తగా రాణించాలనుకునే ఔత్సాహికులకు వేదికగా నిలిచే బిజినెస్‌ రియాలిటీ షో.

ఇందులో పారిశ్రామికవేత్తలు తమ కొత్త వ్యాపార ఆలోచనలు, ఉత్పత్తులను పెట్టుబడిదారుల ముందు ప్రదర్శిస్తారు.

నచ్చిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. ఇదే తరహా విధానాన్ని భారత్‌-జపాన్‌ స్టార్టప్‌ రంగంలోనూ అమలు చేయాలని గోయల్‌ ప్రతిపాదించారు.

ADVERTISEMENT