PM Surya Ghar Yojana: 300 యూనిట్ల ఉచిత కరెంట్.. సోలార్‌కు కేంద్రం భారీ సబ్సిడీ
ఈ వార్తాకథనం ఏంటి
నెలనెలా పెరుగుతున్న విద్యుత్ బిల్లులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మంచి అవకాశంగా నిలుస్తోంది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే గరిష్ఠంగా రూ.78,000 వరకు సబ్సిడీ పొందవచ్చు. అంతేకాదు, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. 2024 ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Details
సామర్థ్యాన్ని బట్టి సబ్సిడీ ఎంతంటే?
సోలార్ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం మారుతుంది.
1 కిలోవాట్ వ్యవస్థకు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది.
మొదటి 2 కిలోవాట్ల వ్యవస్థ ఖర్చులో 60 శాతం, అదనంగా 2 నుంచి 3 కిలోవాట్ల మధ్య ఉండే సామర్థ్యానికి 40 శాతం సహాయం అందుతుంది.
అయితే సబ్సిడీ లెక్కింపు గరిష్ఠంగా 3 కిలోవాట్ల వరకే ఉంటుంది.
Details
దరఖాస్తు ఎలా చేయాలి?
సబ్సిడీ పొందాలనుకునే కుటుంబాలు పీఎం సూర్య ఘర్ జాతీయ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అక్కడ తమకు సరిపోయే సోలార్ సామర్థ్యాన్ని ఎంచుకోవడంతో పాటు, అందుబాటులో ఉన్న విక్రేతల వివరాలు, రేటింగ్‌లు, ప్రయోజనాల లెక్కింపు వంటి సమాచారాన్ని పరిశీలించవచ్చు.
అనంతరం ఎంపిక చేసిన విక్రేత ద్వారా ప్యానెల్స్ ఏర్పాటు చేయించుకోవాలి.
విద్యుత్ పంపిణీ సంస్థ (DISCOM) తనిఖీ, రిడెంప్షన్ అభ్యర్థన పూర్తయిన తర్వాత సాధారణంగా 30 నుంచి 45 రోజుల్లో సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
Details
తక్కువ వడ్డీతో రుణ సదుపాయం
సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ఒకేసారి డబ్బు ఖర్చు చేయలేని వారికి రుణ సదుపాయం కూడా ఉంది.
3 కిలోవాట్ల వరకు వ్యవస్థల కోసం రూ.2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు పొందవచ్చు. SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు రూ.2 లక్షల వరకు 5.75 శాతం వార్షిక వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి.
ఇతర బ్యాంకుల్లోనూ ఈ సదుపాయం ఉంది. జనసమర్థ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు మారే అవకాశం ఉన్నందున దరఖాస్తుకు ముందు బ్యాంకును సంప్రదించాలి.
Details
విద్యుత్ ఆదాతో పాటు అదనపు ఆదాయం
3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ నెలకు సగటున 300 యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేయగలదని అంచనా.
ఇంటి అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్‌ను DISCOMలకు విక్రయించి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఈ పథకం ద్వారా నివాస రంగంలో 30 గిగావాట్ల సోలార్ సామర్థ్యం జోడించాలని, 25 ఏళ్లలో 720 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పథకం గడువు 2027 మార్చి 31 వరకు ఉంది.
Details
ఢిల్లీలో ఉచితంగా సోలార్ ప్యానెల్స్
ఇదిలా ఉంటే, ఢిల్లీలో 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు.
2.25 లక్షల ఇళ్లకు ఈ ప్రయోజనం కల్పించనున్నారు. ముందుగా నమోదు చేసుకున్నవారికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.