Loading...
Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ 'ఆపరేషన్ బీపర్‌ 2.0'..? పేజర్లు, వాకీటాకీలే టార్గెట్‌!
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ 'ఆపరేషన్ బీపర్‌ 2.0'..? పేజర్లు, వాకీటాకీలే టార్గెట్‌!

Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ 'ఆపరేషన్ బీపర్‌ 2.0'..? పేజర్లు, వాకీటాకీలే టార్గెట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ రహస్య ఆపరేషన్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 2024లో లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా దళాల పేజర్లలో పేలుడు పదార్థాలు అమర్చి, వాటిని పేల్చిన తరహాలోనే ఇరాన్‌ విషయంలోనూ ఇజ్రాయెల్‌ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అప్పట్లో చేపట్టిన ఈ ఆపరేషన్‌ 'గ్రిమ్ బీపర్'గా (Operation Grim Beeper) ప్రచారంలోకి వచ్చింది. మొసాద్‌ (Mossad) మాజీ గ్లోబల్ ఆపరేషన్స్ డిప్యూటీ హెడ్ ఒడెడ్ ఐలామ్‌ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఈ వివరాలను వెల్లడించింది. వాటి ప్రకారం.. ఇజ్రాయెల్‌, అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులు ప్రారంభిస్తే టెహ్రాన్‌కు చెందిన కీలక నేతలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.

వివరాలు

కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న ఇజ్రాయెల్

ఇందుకోసం 'ఆపరేషన్ గ్రిమ్ బీపర్' తరహాలో పేజర్లు, బీపర్లు, వాకీటాకీల వంటి కమ్యూనికేషన్ పరికరాలను పేల్చే వ్యూహాన్ని అమలు చేయవచ్చని కథనాలు పేర్కొంటున్నాయి.

ఇలాంటి పేలుడు పదార్థాలు అమర్చిన పరికరాలను ఇప్పటికే ఇరాన్‌లోకి చేరవేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇరాన్‌ నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇజ్రాయెల్‌ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తరహా రహస్య ఆపరేషన్లు భూతల దాడుల కంటే మరింత వినాశకరంగా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

గతంలో టెహ్రాన్‌ అణు శుద్ధి కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లలో ఇజ్రాయెల్‌ పేలుడు పదార్థాలను అమర్చి, వాటిని సరఫరా చేసినట్లు ఇరాన్‌ మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ జావెద్‌ జారిఫ్‌ ఇటీవల వెల్లడించారు.

వివరాలు

టార్గెట్‌ లిస్ట్‌లో నలుగురు కీలక నేతలు

ప్రస్తుతం ఇరాన్‌లో అధ్యక్షుడు పెజెష్కియన్‌, సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei), విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబఫ్‌ కీలక పదవుల్లో ఉన్నారు. అయితే వీరు కేవలం నామమాత్రపు నాయకులేనని ఇజ్రాయెల్‌ భావిస్తున్నట్లు సమాచారం.

వారి వెనుక ఉండి దేశాన్ని నడిపించే అధికార కేంద్రాలు వేరుగా ఉన్నాయని, కీలక నిర్ణయాలు కూడా ఆ వర్గాలే తీసుకుంటాయని ఇజ్రాయెల్‌ అంచనా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

మొజ్తబా ఖమేనీ సహా బహిరంగంగా కనిపించే నేతలంతా తెరవెనుక ఉన్న ఈ కీలక వ్యక్తుల సూచనల మేరకే వ్యవహరిస్తున్నారని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

ఆ నలుగురు నేతలు వీరే..

అహ్మద్ వాహిది: ఇరాన్‌ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్‌-ఇన్‌-చీఫ్‌.

హుస్సేన్ తాయెబ్: బసిజ్ దళాల కమాండర్‌.

అలీ అబ్దుల్లాహి: ఇరాన్‌ సైన్యాధిపతి.

మొహ్సెన్ రెజాయి: సుప్రీం నేషనల్ సెక్యూరిటీ సెక్రటరీ.

ఈ ఏడాది జనవరిలో ఇరాన్‌లో జరిగిన ఆందోళనల సమయంలో 75 వేల మంది నిరసనకారులను దారుణంగా ఊచకోత కోయడం వెనుక ఈ నలుగురి హస్తం ఉన్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌ ప్రభుత్వ నేతలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఈ నలుగురే దానికి అడ్డుపడుతున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

ఆందోళనల అణచివేతలోనూ వీరి పాత్ర?

గతంలో అమెరికాతో ఒప్పందం కుదిరిన సమయంలో హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ప్రకటించారు.

అయితే ఆ తర్వాత ఐఆర్‌జీసీ దళాలు మళ్లీ ఆ జలసంధిని మూసివేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ ఈ నలుగురు నేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా-ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ నలుగురు నేతలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. రహస్య కోవర్ట్‌ ఆపరేషన్ల ద్వారా వారిని హతమార్చాలన్నది ఇజ్రాయెల్‌ ప్రణాళికగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

అయితే, ఈ ఆపరేషన్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ADVERTISEMENT