Elon Musk: పోటీకి సిద్ధమన్న రిలయన్స్.. మస్క్ రియాక్షన్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి ప్రవేశించలేకపోతున్నానంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్నిరోజులుగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ సంస్థపై ఆయన ఆరోపణలు చేయగా.. వాటిని ఆ సంస్థ తీవ్రంగా తోసిపుచ్చింది. పోటీకి తాము ఎప్పుడూ భయపడమని స్పష్టం చేసింది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలను స్వాగతిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ప్రకటనపై మస్క్ తాజాగా స్పందించారు. 'ధన్యవాదాలు.. అభినందనీయం' అంటూ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
వివరాలు
భారత్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాం: స్టార్‌లింక్
భారత్‌ను హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ కూడా వెల్లడించింది.
భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఐదేళ్లకు పైగా నియంత్రణ సంస్థలు, పరిశ్రమ వర్గాలు, ఆపరేటర్లతో కలిసి పనిచేశామని పేర్కొంది.
భారత్‌లో ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు అంతరాయాలు కలగకుండా చూసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించామని స్టార్‌లింక్ తెలిపింది.
అంతేకాకుండా ప్రభుత్వ అనుమతులు కూడా పొందినట్లు వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌ను హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు సిద్ధంగా ఉన్నామని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.
వివరాలు
స్టార్‌లింక్ రాకను అడ్డుకుంటున్నారన్న మస్క్
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభాన్ని కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) శుక్రవారం గట్టిగా స్పందించింది. పోటీకి తాము ఎప్పుడూ భయపడలేదని స్పష్టం చేసింది.
'వినియోగదారులకు ఎవరు అత్యుత్తమ సేవలు అందిస్తారనేదే అసలైన పరీక్ష. పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు భారత్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది.
భారత్‌లో అయినా, విదేశాల్లో అయినా చట్టాల ప్రకారమే అన్ని కార్యకలాపాలు సాగాలి'' అని రిలయన్స్ పేర్కొంది.
వివరాలు
రిలయన్స్ ప్రకటనపై మస్క్ ఏమన్నారంటే?
స్టార్‌లింక్‌పై వచ్చిన ఆరోపణలను రిలయన్స్ తోసిపుచ్చడంతో పాటు, ఆ సంస్థ రాకను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రకటనకు స్పందించిన ఎలాన్ మస్క్.. 'ధన్యవాదాలు.. అభినందనీయం' అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
మరోవైపు భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని స్టార్‌లింక్ చెబుతోంది.
దీంతో భారత శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.