SBI and SBI Capital Markets: NSE రూ.30 వేల కోట్ల ఐపీఓ.. 25 లక్షల షేర్లు విక్రయించనున్న SBI గ్రూప్
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల జోరు కొనసాగుతోంది. దాదాపు ప్రతిరోజూ రెండు, మూడు పబ్లిక్ ఇష్యూలు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటున్నాయి. కొన్ని ఐపీఓలు లిస్టింగ్ అవుతుండగానే.. మరికొన్ని ఇష్యూలు సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నాయి. దీంతో ప్రతి వారం సగటున ఐదు నుంచి ఆరు ఐపీఓలు యాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి వీటికి భారీ స్పందన లభించడంతోపాటు.. లిస్టింగ్‌లో మంచి ప్రీమియంను కూడా నమోదు చేస్తున్నాయి. గత వారం టెంప్‌సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ ఐపీఓ ఏకంగా 111 శాతం ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. సెప్టెంబరులో మరిన్ని భారీ ఐపీఓలు మార్కెట్‌ను పలకరించే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ఐపీఓపై అందరి దృష్టి ఉంది.
వివరాలు
రూ.5.26 లక్షల కోట్ల వాల్యుయేషన్?
NSE ఐపీఓ విలువ సుమారు రూ.30,000కోట్ల నుంచి రూ.31,500కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
కంపెనీ మార్కెట్ విలువ లేదా వాల్యుయేషన్ సుమారు రూ.5.26లక్షల కోట్లకు చేరొచ్చని భావిస్తున్నారు.
ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలోనే ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు.
అంటే NSE కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయదు. సుమారు 6శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.30వేల కోట్లకు పైగా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అంచనాల ప్రకారం ఈ ఇష్యూ విజయవంతమైతే.. భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓగా NSE నిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం రూ.27,870 కోట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ అతిపెద్దదిగా ఉంది. NSE ఇష్యూ దాన్ని అధిగమించనుంది.
వివరాలు
14.89 కోట్ల షేర్ల విక్రయం
మొత్తంగా NSE ఐపీఓలో సుమారు 14.89 కోట్ల షేర్లను OFS కింద విక్రయించనున్నారు.
ఇందులో SBI గ్రూప్ కూడా తన వాటాను విక్రయించే వాటాదారుల్లో ఒకటిగా ఉంది.
SBI గ్రూప్‌కు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), దాని అనుబంధ సంస్థ SBI క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ కలిసి NSEలో తమకున్న వాటాలో మొత్తం 1 శాతం వరకు విక్రయించాలని యోచిస్తున్నట్లు SBI ఛైర్మన్ సీఎస్ శెట్టి (చల్లా శ్రీనివాసులు శెట్టి) వెల్లడించారు.
ప్రస్తుతం NSEలో SBIకి 3.23 శాతం వాటా ఉంది. మరోవైపు SBI క్యాపిటల్ మార్కెట్స్‌కు 4.33 శాతం వాటా ఉంది.
వివరాలు
SBI వాటాలో 15.90 లక్షల షేర్లు
NSE ఐపీఓలో భాగంగా SBI తన వాటాలో 0.65 శాతానికి సమానమైన 15.90 లక్షల షేర్లను విక్రయించనుంది.
అలాగే SBI క్యాపిటల్ మార్కెట్స్ 0.35 శాతం వాటాకు సమానమైన 8.78 లక్షల షేర్లను OFS కింద విక్రయించనున్నట్లు సమాచారం.
ఈ రెండు సంస్థలను కలిపి చూస్తే SBI గ్రూప్ మొత్తం సుమారు 24.7 లక్షల NSE షేర్లను విక్రయించనుంది.
NSEలో భారీ ఐపీఓకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో SBI గ్రూప్ వాటా విక్రయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
జులైలోనూ SBI వాటా విక్రయం
ఇదిలా ఉంటే.. SBI ఇటీవల మరో కీలక వాటా విక్రయాన్ని కూడా చేపట్టింది.
గత జులైలో తన విదేశీ భాగస్వామి అముండీతో కలిసి SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ కోసం ఆ సంస్థలో తమకున్న వాటాలో 10 శాతం వరకు విక్రయించిన విషయం తెలిసిందే.