Page Loader
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం సూచీలు దూసుకుపోయాయి. గతంలో నష్టాల్లో ఉన్న మార్కెట్ ప్రధాన షేర్ల కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,ఎస్‌బీఐ షేర్ల రాణింపు మార్కెట్‌ను లాభాల దిశగా నడిపింది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 470 పాయింట్లు పెరిగి,నిఫ్టీ 23,300 మార్కును దాటింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 424 పాయింట్ల లాభంతో 77,131 వద్ద,నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 23,338 వద్ద ట్రేడవుతుండగా, అదానీ పోర్ట్స్‌, జొమాటో, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

వివరాలు 

లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

అదే సమయంలో హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, టైటాన్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82.27 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,724 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి-డాలర్ మారకం విలువ 86.42 వద్ద ఉంది. బుధవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా, నాస్‌డాక్ 2 శాతం, ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్ 1 శాతం పెరిగాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు లాభాల్లో ట్రేడవుతుండగా, విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.4,533 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.3,683 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.