Unemployment Rate: సెప్టెంబర్లో 5 శాతంగా నిరుద్యోగిత రేటు.. పట్టణ మహిళల్లో పెరిగిన ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో నిరుద్యోగిత రేటు సెప్టెంబర్ 2026లో 5 శాతంగా నమోదైంది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో నిరుద్యోగిత పరిస్థితిని పరిశీలిస్తే.. ఆగస్టులోనూ ఇదే స్థాయి కొనసాగింది. అయితే గత ఏడాది సెప్టెంబర్లో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే ప్రస్తుతం నిరుద్యోగిత రేటు తగ్గింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(NSO)విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(PLFS)ఈ వివరాలను వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 4.2 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ రేటు స్వల్పంగా పెరిగింది. ఆగస్టులో 6.8 శాతంగా ఉన్న పట్టణ నిరుద్యోగిత రేటు సెప్టెంబర్లో 6.9 శాతానికి చేరింది. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉన్నట్లు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
గ్రామీణ మహిళల్లో 2026లోనే కనిష్ఠ నిరుద్యోగిత
దేశవ్యాప్తంగా మహిళల నిరుద్యోగిత రేటు సెప్టెంబర్లో 5.2 శాతంగా నమోదైంది. గ్రామీణ మహిళల్లో ఈ రేటు 3.9 శాతానికి తగ్గడం విశేషం.
2026 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇదే కావడం గమనార్హం.
మరోవైపు పట్టణ మహిళల్లో నిరుద్యోగిత రేటు పెరిగింది. ఆగస్టులో 8.9 శాతంగా ఉన్న ఈ రేటు సెప్టెంబర్లో 9.2 శాతానికి చేరింది.
పురుషుల్లో 4.9 శాతంగా నిరుద్యోగిత రేటు
15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న పురుషుల్లో నిరుద్యోగిత రేటు సెప్టెంబర్లో 4.9 శాతంగా నమోదైంది.
గత నెలతో పోలిస్తే ఈ రేటులో మార్పు లేదు. జూన్ నుంచి పురుషుల నిరుద్యోగిత రేటులో తగ్గుదల లేదా స్థిరమైన ధోరణి కనిపిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
వివరాలు
55.5 శాతానికి చేరిన శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు
దేశంలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) సెప్టెంబర్లో 55.5 శాతానికి చేరింది.
ముఖ్యంగా మహిళల భాగస్వామ్య రేటు ఏడాది ప్రాతిపదికన 0.5 శాతం పాయింట్లు పెరిగి 34.6 శాతానికి చేరింది.
గ్రామీణ మహిళల్లో ఈ రేటు 38.9 శాతంగా నమోదైంది. ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారిలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు కీలక సూచికగా పరిగణిస్తారు.
3.70 లక్షల మందికి పైగా వివరాలతో అంచనాలు
దేశవ్యాప్తంగా 3,70,513 మంది వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా NSO ఈ నెలవారీ నిరుద్యోగిత అంచనాలను రూపొందించింది.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా దేశంలో ఉపాధి, నిరుద్యోగిత పరిస్థితులు, శ్రామిక శక్తి భాగస్వామ్యానికి సంబంధించిన వివరాలను అంచనా వేస్తారు.