నన్ను నమ్మే వాళ్ళ కోసం ఇంకా కష్టపడతాను; ఏజెంట్ ఫెయిల్యూర్ పై అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొంచిన చిత్రం ఏజెంట్. దాదాపు 80కోట్లకు పైగా ఈ సినిమాను ఖర్చు పెట్టారని టాక్. ఎంత ఖర్చు చేసినా సినిమాలో విషయం లేకపోతే చతికిలపడుతుంది. ఏజెంట్ విషయంలో జరిగింది ఇదే. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏజెంట్, ఎక్కడ కూడా వినోదాన్ని అందించలేకపోయాడు. దాంతో అఖిల్ కెరీర్లో ఖరీదైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఏజెంట్ ఫెయిల్యూర్ పై మొదటిసారిగా స్పందించాడు అఖిల్. ఏజెంట్ సినిమాను తెరమీదకు తీసుకొచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూనే, తెరమీదకు సరిగ్గా తీసుకురాలేక పోయామని అన్నాడు. నిర్మాత అనిల్ సుంకరను తనకు సపోర్ట్ సిస్టమ్ గా చెప్పుకొచ్చాడు.
డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు తెలియజేసిన అఖిల్
ఏజెంట్ సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు, ఇంకా మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసాడు. ప్రేక్షకులు చూపించే ప్రేమ వల్లే తాను సినిమాలు చేయగలనని, ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తాననీ, తనను నమ్మే ప్రేక్షకుల కోసం ఇంకా ఎక్కువగా కష్టపడతానని, తనమీద నమ్మకం పెట్టుకున్న ప్రేక్షకులకు వినోదం పంచడానికి మరింత బాగా కృషి చేస్తానని అన్నాడు. ఏజెంట్ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్యా హీరోయిన్ గా నటించింది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, సరెండర్ 2 సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసారు. హిప్ హాప్ థమిజా సంగీతం అందించాడు.